చంద్ర‌బాబు నిర్ణ‌యాలే బొత్స‌కు వ‌రం!

విజ‌యన‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లా రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌స్తుతం సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు సీఎం చంద్ర‌బాబు తీసుకున్న ఒక నిర్ణ‌యంతో ఆయ‌న స్ట్రాంగ్ అవుతున్నారు. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో సీఎం పాటించిన కొన్ని స‌మీక‌ర‌ణాలు.. బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు వ‌రాలుగా మారుతున్నాయ‌ట‌. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నాయ‌ట‌. చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌తో 2014 ఎన్నిక‌ల ఫ‌లితాలు తారుమారయ్యే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. స్వేచ్ఛ ఇవ్వ‌క‌వ‌పోవ‌డంతో బొత్స కొంత వెన‌కుడుగు వేయాల్సి వ‌స్తోంద‌ట‌.

విజయనగరం జిల్లాలో పదేళ్లపాటు ఏకపక్షంగా అధికారం చెలాయించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హవాకు 2014 ఎన్నికల్లో ఓటర్లు చెక్‌ పెట్టారు. తూర్పు కాపు కులానికి చెందిన ఆ సామాజికవర్గాన్ని అనుకూలంగా మలచు కోవడంలో విఫలమ‌య్యారు. బొత్సపై విజయం సాధించిన ఆయన సామాజికవర్గానికి చెందిన మృణాళినిని మంత్రి పదవి తప్పించి, బొబ్బిలి రాజవంశం, వెలమ కులానికి చెందిన సుజయ రంగారావుకు మంత్రి పదవి ఇవ్వడంతో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారాయి. ఈ ప‌రిణామాలే రాజకీయంగా, అధికారికంగా మళ్లీ బొత్స‌ ముందుకెళ్లే అవకాశం తాజా పరిణామాలు కల్పించాయి.

మూడేళ్ల నుంచి కేంద్ర మంత్రిగా అశోక్‌గజపతిరాజు పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఇద్దరు మంత్రులు అగ్రకులానికి చెందిన వారే కావడంతో తూర్పుకాపు కులస్తులు ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నార‌ట‌. ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పి.నారాయణస్వామి నాయుడికి మంత్రి పదవి ఇస్తారని తూర్పుకాపులు భావించారు. కానీ చంద్రబాబు.. రంగారావు వైపు మొగ్గుచూపడంతో ఆ వర్గ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నాయకులు, ఎమ్మెల్యేలు ఇటీవల చంద్రబాబును కలసి ప‌రిస్థితి వివ‌రించారు. ఈ పరిణామం భవిష్యత్‌ ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉందని చెప్పారట. కానీ ఆయ‌న ప‌ట్టించుకోలేద‌ట‌.

విజయనగరం జిల్లాలో బీసీ సామాజికవర్గ ఓటర్లు తొంభైశాతానికి పైగా ఉన్నారు. వీరిలో తూర్పుకాపుల ప్రభావం ఎక్కువగా ఉంది. రాజ‌కీయ ప‌రిణామాల్లో తూర్పుకాపు ఓటర్లతో పాటు నాయకులు కూడా కొందరు బొత్స వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు బొత్స రంగంలోకి దిగారు. కానీ…ఆయనకు జగన్‌ పూర్తి స్వేచ్ఛ ఇచ్చే అవకాశం లేకపోవడంతో పరిస్థితిలో ఇప్పుడు పెద్దగా మారదని, ఒక వేళ జగన్‌ బొత్సకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ప‌రిస్థితి మ‌రోలా ఉంటుంద‌ని చెబుతున్నారు.