గుంటూరు జిల్లా హ‌త్య కేసు.. ప‌రారీలో ఆ పార్టీ ఎమ్మెల్యే

గుంటూరు జిల్లాలో సంచ‌ల‌నం రేపిన ఓ హ‌త్య కేసుకు సంబంధించి విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ప‌రారీలో ఉన్నారు. పల్నాడులోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన పాపిరెడ్డి హ‌త్య కేసులో ప‌దిమంది నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన తాడిప‌ర్తి పాపిరెడ్డిని ఈ నెల 17న వైసీపీకి చెందిన కొంద‌రు వ్య‌క్తులు క‌త్తులు, రాడ్ల‌తో తీవ్ర‌గా గాయ‌ప‌ర‌చ‌డంతో ఆయ‌న మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న పూర్వాప‌రాలు ఇలా ఉన్నాయి.

గ‌త ఎన్నిక‌ల టైంలో కండ్ల‌కుంట గ్రామం రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. ఆ త‌ర్వాత గ్రామంలో క‌క్ష‌లు పెరిగిపోయాయి. ఈ యేడాది ఆరంభంలో గ్రామంలో కాయిదా పాట‌ల విష‌యంలోను, తాగునీటి స‌ర‌ఫ‌రా బోరు విష‌యంలో ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో గొడ‌వ‌లు జ‌రిగాయి. ఈ క్ర‌మంలోనే ఈ నెల 17న పాపిరెడ్డిపై వైసీపీకి చెందిన 10 మంది వ్య‌క్తులు క‌త్తులు, రాడ్డుల‌తో విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడిచేసి చంపేశారు.

ఈ హ‌త్య‌తో ప్రమేయం ఉన్న ప‌దిమంది నిందితుల‌ను ఇప్ప‌టికే పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఈ హత్య కేసులో భాగస్వాములైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి, హనిమిరెడ్డిలను అరెస్ట్‌ చేయాల్సి ఉందని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి ఆజ్ఞాతంలో ఉన్నారు.