టీడీపీ స‌రే…టీఆర్ఎస్ ఒరిజిన‌లా..!

ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు. పేరు చెప్ప‌గానే గుర్తొచ్చే నేత‌ల్లో ఈయ‌న ఒక‌రు. తెలంగాణ‌లో ఒక‌ప్పుడు టీడీపీకి అంతాతానై వ్య‌వ‌హ‌రించిన వ‌రంగ‌ల్‌ జిల్లాకు చెందిన నేత‌. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఓటు బ్యాంకును కూడా సిద్ధం చేసుకున్న ఈయ‌న‌.. టీడీపీకి ఒక‌ప్పుడు వీర విధేయుడు! ముఖ్యంగా చంద్ర‌బాబు విధానాలు, టీడీపీ సిద్ధాంతాల కోసం క‌ష్ట‌ప‌డ్డాడు. అయితే, రోజులు మార‌తాయి అన్న‌ట్టు స్టేట్ విభ‌జ‌న నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఏపీకే ప‌రిమితం అవ‌డం, తెలంగాణ‌లో టీడీపీ నానాటికీ తీస‌క‌ట్టుమాదిరిగా మారిపోవ‌డం తెలిసిందే.

దీంతో ఇక‌, టీడీపీ ఎదిగే అవ‌కాశం లేద‌ని, ఆ పార్టీలో ఉంటే అడుక్కుతిన‌డ‌మే గ‌తి అవుతుంద‌ని గ్ర‌హించిన ఎర్ర‌బెల్లి.. ఓ శుభ ముహూర్తాన సైలెంట్‌గా కేసీఆర్ పంచన చేరిపోయారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఓడ దాటాక ఎవ‌డో బోడి మ‌ల్ల‌న్న అన్న‌ట్టు.. ఇప్పుడు ఎర్ర‌బెల్లి వారికి టీడీపీపై విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌రిపాటిగా మారి.. ఆ పార్టీలోని ఒరిజినాలిటీపై సందేహాలు బ‌య‌ల్దేరాయి. నిజ‌మే.. దాదాపు స‌గానికిపైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీ నుంచి జంప్ చేసిన నేప‌థ్యంలో ఇక తెలంగాణ టీడీపీలో ఒరిజినాలిటీ వెత‌కడం క‌ష్ట‌మే.

అందునా.. అన్న‌గారి హ‌యాం నుంచి ఉన్న ఎర్ర‌బెల్లికి ఈ స‌మ‌స్య మ‌రింత పెద్ద‌దే. అయితే, ఇప్పుడు ఎర్ర‌బెల్లి ఎక్కిన కారు విష‌యానికి వ‌స్తే.. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ కి మాత్రం ఒరిజినాలిటీ ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఉద్య‌మ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను ఏకం చేసేందుకు, రాష్ట్ర సాధ‌న కోసం , బంగారు తెలంగాణ ఆవిర్భావం కోసం పుట్టిన టీఆర్ ఎస్‌లో ఇప్పుడు ఆ ల‌క్ష‌ణాలు ఉన్నాయా? అనేది ప‌లువురి ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి.

రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, ఉపాధి క‌ల్ప‌న‌లో వెనుకంజ‌, ఫీజుల రీయింబ‌ర్స్ మెంట్ త‌దిత‌ర అనేక స‌మ‌స్య‌లు కేసీఆర్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఏ తెలంగాణ ప్ర‌జ‌ల కోసం పుట్టిందో అదే పార్టీ ఆ ప్ర‌జ‌ల‌ను విస్మ‌రిస్తోంద‌నే విప‌క్షాల వ్యాఖ్య‌ల‌తో టీఆర్ ఎస్ ఒరిజినాలిటీ ప్ర‌మాద‌క‌రంగా మార‌లేదా? మ‌రి దీనికి ఎర్ర‌బెల్లి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా? అంటే నూటికి నూరుశాతం క‌ష్ట‌మే!!