ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న‌… చేతులు దులుపుకున్న చంద్ర‌బాబు

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీకి వినిపించిన విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావుకు భార‌త ర‌త్న అవార్డు ఇవ్వాలి అనేది కొన్నేళ్లుగా ఏపీలో విన‌బ‌డుతున్నామాట‌! అయితే, ఇది కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశం కావ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వాలే చొర‌వ తీసుకుని ప్ర‌య‌త్నం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్ప‌టికే ఈ విష‌యం కేంద్రానికి కూడా చేరింది. ఇక‌, తాజా విష‌యానికి వ‌స్తే.. ఎన్‌టీఆర్‌కు భార‌త ర‌త్న ఇవ్వాలి అనే అంశంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఓ అభిప్రాయం లేదా? అనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

నిన్న విశాఖ‌లో జ‌ర‌గిన రెండో రోజు మ‌హానాడులో ఎన్‌టీఆర్‌కు భార‌త ర‌త్న ఇవ్వాల‌నే తీర్మానాన్ని ప్ర‌భుత్వ మీడియా స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ప్ర‌వేశ పెట్ట‌డం చ‌ర్చ‌కు, ఆ త‌ర్వాత ర‌చ్చ‌కు దారితీసింది. ఆయ‌న టీడీపీ నేత కాక‌పోవ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం. పార్టీలో అనేక మంది ఎన్‌టీఆర్‌కు ఇష్ట‌మైన సీనియ‌ర్ నేత‌లు ఉన్నారు. వారంద‌రినీ ఒదిలి పెట్టి.. ప్ర‌జారాజ్యం నుంచి జంప్ చేసి టీడీపీలో అవ‌స‌రార్థం ఉంటున్న ప‌ర‌కాల‌తో తీర్మానం చేయించ‌డం ఏమిట‌నే ప్ర‌శ్న బ‌లంగా వినిపించింది. అయితే, దీనిని మ‌హానాడు వేదిక‌పైనే చంద్ర‌బాబు బ‌లంగా స‌మ‌ర్ధించుకున్నారనుకోండి!!

ఇక‌, అదేస‌మ‌యంలో కేంద్రంలో చంద్ర‌బాబు అనుకూల ప్ర‌భుత్వం కాదు కాదు.. భాగ‌స్వామ్య ప్ర‌భుత్వ‌మే ఉంద‌ని, బాబు ఎంత చెబితే అంత అక్క‌డ ప‌ని జ‌రుగుతుంద‌ని అలాంట‌ప్పుడు ఎన్‌టీఆర్ కు భార‌త ర‌త్నం ఇప్పించ‌డం క‌ష్ట‌సాధ్య‌మా? అనే మ‌రో వాద‌న బ‌య‌లు దేరింది. ఇప్ప‌టికే కేంద్రంలో ప్ర‌భుత్వం వ‌చ్చి మూడేళ్లు గ‌డిచింద‌ని, ఈ లోపే చంద్ర‌బాబు ట్రై చేస్తే ఇప్ప‌టికే వ‌చ్చేద‌ని కొంద‌రు అంటున్నారు. మ‌రి ఈ విష‌యంలో ఎన్‌టీఆర్‌కి భార‌త ర‌త్నపై బాబు కూడా కేవ‌లం సిఫార్సుల‌తోనే చేతులు దులిపేసుకోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి బాబు దీనికి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.