వైసీపీలో ఉహాగానా వార్తలు జోరుగా వినిపిస్తున్నవేళ ..!

ఏపీలో కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం దోబూచులాట‌, మ‌రోవైపు ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో ఏపీలో ఎన్నిక‌లు హీటెక్కుతుంటే మ‌రోవైపు క‌ప్ప‌దాట్లు, ఫిరాయింపులు సైతం జోరుగానే సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే గుంటూరు జిల్లాలో కీల‌క రాజ‌కీయ నాయకుడు ఒక‌రు వైసీపీలోకి జంప్ చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టు జిల్లా రాజ‌కీయాల్లో వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర‌రావు త‌న‌యుడిగా రాజ‌కీయారంగ్రేటం చేసిన మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కాంగ్రెస్ టైంలో రెండుసార్లు గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. రెండోసారి గెలిచాక మ‌నోహ‌ర్ స్పీక‌ర్‌గా కూడా ప‌నిచేశారు. మ‌నోహ‌ర్‌తో పాటు కాంగ్రెస్‌లో కీల‌క ప‌ద‌వులు అనుభ‌వించిన బొత్స‌, ధ‌ర్మాన‌, క‌న్నా, జేసీలాంటి వాళ్లు ఇత‌ర పార్టీల్లో చేరిపోయారు. అయినా మ‌నోహ‌ర్ మాత్రం ఇంకా కాంగ్రెస్‌నే ప‌ట్టుకుని వేలాడుతున్నారు.

ఇక ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు గ‌ట్టిగా రెండేళ్ల టైం కూడా లేదు. మ‌రోవైపు ముంద‌స్తు ఎన్నిక‌ల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌నోహ‌ర్ వైసీపీ వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌నోహ‌ర్ వైసీపీలో చేరే అంశంపై బాప‌ట్ల ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తితో పాటు వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ట‌. ఇక తెనాలిలో వైసీపీ చాలా వీక్‌గా ఉంది. మ‌నోహ‌ర్ లాంటి పొలిటిషీయ‌న్ ఆ పార్టీలో చేరితే అక్క‌డ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ లాంటి వాళ్ల‌కు గ‌ట్టి ప్ర‌త్య‌ర్థిగా మార‌తాడు.