టీడీపీ వాళ్ల‌నే టార్గెట్ చేస్తోన్న ఏపీ మంత్రి

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా రాజ‌కీయాలు ర‌సవ‌త్త‌రంగా మారుతున్నాయి. బీజేపీ, టీడీపీ మ‌ధ్య ఆంత‌ర్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల‌రావుకి, మున్సిప‌ల్ చైర్మ‌న్ మధ్య విభేదాలు తార‌స్థాయికి చేరాయి. ప్ర‌తి వ్య‌వ‌హారంలోనూ టీడీపీ, బీజేపీ శ్రేణుల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమనేంత‌గా క‌ల‌హాలు ముదిరిపోయాయి! ప్ర‌తి విష‌యంలోనూ మంత్రి టీడీపీ నాయ‌కుల‌ను టార్గెట్ చేయ‌డాన్ని టీడీపీ శ్రేణులు స‌హించ‌లేక‌పోతున్నాయి. మిత్ర ప‌క్ష‌మ‌యినా.. విప‌క్షంలా వ్య‌వ‌హ‌రిస్తున్నారిన మండిపడుతున్నాయి. ఇదే ప‌ద్ధ‌తి కొన‌సాగితే గ‌త ఎన్నిక‌ల్లో గెలిపించిన తామే వచ్చే ఎన్నిక‌ల్లో ఓడిస్తామ‌ని స్పష్టంచేస్తున్నాయి.

బీజేపీ-టీడీపీ మ‌ధ్య పొత్తు ఉన్నా.. కొన్ని చోట్ల ఎవ‌రికి వారే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రెండు పార్టీల్లోని దిగువ శ్రేణి నాయ‌కుల మ‌ధ్య తీవ్ర‌మైన అసంతృప్తి ర‌గులుతోంది. ఇందుకు తాడేప‌ల్లిగూడెం నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. ఇక్క‌డ నుంచి గెలుపొందిన పైడికొండ‌ల మాణిక్యాల రావుకి, టీడీపీ నేత‌ల‌కు మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డం లేదు. తెలుగుదేశం పార్టీ చేప‌ట్టిన ప‌నుల్లో మంత్రి అడుగ‌డుగునా అడ్డు త‌గ‌ల‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తాడేపల్లిగూడెంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు.

మంత్రి మాణిక్యాలరావు తెలుగుదేశం శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు ఒడి గడుతున్నారని మునిసిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్ విమ‌ర్శించారు. జగన్నాథపురంలో మంత్రి మనుషులు తవ్వకాలు సాగిస్తే అడ్డుకోకుండా తెలుగుదేశం పార్టీ అన్న కారణంగానే మాధవరంలో నీరు-చెట్లు ప‌నుల‌ను మంత్రి అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రజల విరాళాలతో స్థాపించిన మహిళా కళాశాలను మతపరమైన సంస్థకు మంత్రి అప్పగించడం తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు క్షమించరన్నారు. కక్షసాధింపు చర్యలు తీసుకుంటే సహించేది లేదని, రెండేళ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకుని, నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మద్దతు కూడగట్టుకోవాలని హితవు పలికారు.

కక్ష సాధింపు కోసమే నియోజకవర్గంలో మద్యం విధానంపై మంత్రి మాట్లాడుతున్నారని స‌భ్యులు దుయ్యబట్టారు. మంత్రి వ్యవహారశైలి ఇదే మాదిరిగా ఉంటే గెలిపించిన తామే ఓడిస్తామని హెచ్చరించారు. ఇప్ప‌టికే ముదిరిపోయిన ఈ వివాదాల‌ను ప‌రిష్క‌రించేందుకు టీడీపీ-బీజేపీ నాయ‌క‌త్వం ఏ మేర‌కు చ‌ర్చిస్తుందో చూడాల్సిందే! ఇలాగే కొన‌సాగితే ఇక రెండు పార్టీల‌కూ న‌ష్టం త‌ప్ప‌దనేది విశ్లేష‌కుల అభిప్రాయం!