రివ‌ర్స్ అవుతోన్న టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌

గ‌త యేడాదిన్న‌ర కాలంగా ఏపీలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ య‌మ జోరుగా సాగింది. అధికార టీడీపీ విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల‌ను విడ‌త‌ల వారీగా త‌న పార్టీలో చేర్చేసుకుంది. దివంగ‌త నేత భూమా నాగిరెడ్డితో స్టార్ట్ అయిన ఈ జంపింగ్‌ల ప‌ర్వంలో మొత్తం రెండు విడ‌త‌ల్లో 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలే సైకిలెక్కేశారు. ఈ జంపింగ్ ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు కూడా ల‌భించాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం మాత్ర‌మే మిగిలిన ఉన్న వేళ టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ రివ‌ర్స్ అవుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ల‌కు, అప్ప‌టి వ‌ర‌కు పార్టీలో ఉన్న‌వాళ్ల‌కు పొస‌గ‌క పోవ‌డంతో వీళ్లంతా వైసీపీలోకి జంప్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎక్క‌డైతే టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స్టార్ట్ చేసిందో అక్క‌డి నుంచే ఆ ఆప‌రేష‌న్ రివ‌ర్స్ అవుతోంది.

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు అక్క‌డ టీడీపీ ఇన్‌చార్జ్ శిల్పా మోహ‌న్‌రెడ్డి అస్స‌లు ఒప్పుకోలేదు. అయినా చంద్ర‌బాబు ఆయ‌న మాట‌ను ప‌ట్టించుకోకుండా భూమాను పార్టీలో చేర్చుకున్నారు. అప్ప‌టి నుంచి శిల్పాకు, భూమాకు అస్స‌లు ప‌డ‌డం లేదు. ఇక ఇటీవ‌ల భూమా నాగిరెడ్డి హ‌ఠార్మ‌ర‌ణం చెందారు. ఆయ‌న కుమార్తె అఖిల‌ప్రియ మంత్రి కూడా అయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో సీటు కూడా భూమా ఫ్యామిలీకే చంద్ర‌బాబు దాదాపు ఖ‌రారు చేసేశారు.ఇవ‌న్నీ శిల్పా మోహ‌న్‌రెడ్డికి మంట పుట్టించాయి.

దీంతో ఆయ‌న త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం వైసీపీలోకి జంప్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ మారే విష‌య‌మై ఇప్పటికే తన అనుచరులతో.. కుటుంబసభ్యులతో.. సన్నిహితులతో చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. శిల్ప వైసీపీ ఎంట్రీకి వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా టీడీపీ ఎక్క‌డ నుంచి అయితే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స్టార్ట్ చేసిందో ఇప్పుడు అక్క‌డ నుంచి అది రివ‌ర్స్ అవుతుండ‌డం ఏపీలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎఫెక్ట్ చూపనుంది.