చంద్ర‌బాబుకు మోడీ ప్ర‌యారిటీ పెరుగుతోందా..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌ విజ‌యం త‌ర్వాత‌ ఏపీ సీఎం చంద్ర‌బాబు, ప్ర‌ధాని మోడీ మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌నే వార్త‌లు బ‌లంగా వినిపించాయి. ఇక చంద్ర‌బాబును మోడీ ప‌క్క‌న పెట్ట‌డం ఖాయ‌మ‌ని, మోడీ వ‌ద్ద బాబు ప్రాధాన్యం త‌గ్గిపోతుంద‌నే ప్ర‌చారం జోరుగా వినిపించింది. కానీ అలా అన్న‌వారే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్ర‌బాబు-మోడీ సాన్నిహిత్యం మ‌ళ్లీ చిగురించింద‌న‌డానికి ఎన్డీయే ప‌క్షాల స‌మావేశం నిద‌ర్శ‌నంగా మారింది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌ త‌రుణంలో అభ్య‌ర్థి ఎంపిక‌పై మోడీ.. చంద్ర‌బాబు స‌ల‌హాలు తీసుకోవ‌డం ఆస‌క్తికరం గా మారింది.

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ధాని మోడీ వ‌ద్ద అంత ప్రాధాన్యం లేద‌ని విప‌క్షాలు ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఏపీకి రాబట్టాల్సిన ప్ర‌త్యేక‌హోదా, రైల్వే జోన్‌ అంశాల విష‌యంలో మోడీ వ‌ద్ద చంద్ర‌బాబు ఎంత మొర‌పెట్టుకున్నా.. అవేమీ ప‌నిచేయ‌లేద‌నే విష‌యం తెలిసిందే! కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే.. చంద్ర‌బాబును మోడీ ఉప‌యోగించుకున్నారనేది విశ్లేష‌కుల అభిప్రాయం. కానీ త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే రాష్ట్రప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక నేప‌థ్యంలో.. మోడీ వ‌ద్ద చంద్ర‌బాబు ప్రాధాన్యం పెరిగింద‌ని తెలుస్తోంది.

ఎన్డీయే పక్షాలకు చెందిన సమావేశం ఢిల్లీలో జరిగింది. 33పార్టీల అగ్రనేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీకి ఒకవైపున బీజేపీ చీఫ్ అమిత్ షా కూర్చుంటే.. మరోపక్క ఏపీ సీఎం చంద్రబాబు కూర్చోవటం విశేషం. ఈ స‌మావేశంలో మోడీ, చంద్రబాబు అందరి దృష్టిని ఆకర్షించారు. మోడీ చెవిలో బాబు.. బాబు చెవిలో మోడీ ఇలా తరచూ మాట్లాడుకోవటం గమనార్హం. అలాగే మూడేళ్ల తమ ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రధాని మోడీ ప్రజంటేషన్ తర్వాత ఇచ్చిన విందులోనూ చంద్ర‌బాబును మోడీ వ‌ద‌ల్లేదు.

ప్రధాని మోడీ.. బీజేపీ చీఫ్ అమిత్ షా.. కేంద్రమంత్రి రాజ్ నాథ్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు. విందు చేస్తున్న వేళ.. చంద్రబాబును ప్రధాని మోడీ పక్కకు తీసుకెళ్లి కాసేపు ఏకాంతంగా చర్చించారు. ఇందులో రాష్ట్రపతి.. ఉప రాష్ట్రపతి అభ్య‌ర్థులుగా ఎవ‌రిని ఎంపిక చేస్తే బాగుంటుంద‌నే విష‌యంపై.. చంద్ర‌బాబు స‌ల‌హాలు మోదీ తీసుకున్నార‌ట‌. అంతేకాదు ఇక చివ‌ర్లో కొంత‌దూరొ చంద్ర‌బాబుతో న‌డిచి.. ఆయ‌నకు వీడ్కోలు ప‌లికారు. మ‌రి వీట‌న్నింటినీ గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబుకు మోడీ బాగానే ప్ర‌యారిటీ ఇచ్చార‌నేది తెలుస్తోంది క‌దూ!