వైసీపీ ఎంపీగా కొమ్మినేని… ఎక్క‌డో తెలుసా..!

కొమ్మినేని శ్రీనివాస‌రావు పేరు చెపితే తెలుగు న్యూస్ ఛానెల్స్ చూసే వారిలో ఆయ‌న తెలియ‌ని వారు ఉండ‌రు. తెలుగు మీడియా వార్తా రంగంలో త‌న విశ్లేష‌ణ‌ల‌తో కొమ్మినేని స‌ప‌రేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. దాదాపు మూడు ద‌శాబ్దాలుగా ఈ రంగంలో ఉంటూ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా ఉన్న ఆయ‌న తెలుగులో చాలా టాప్ మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశారు. ఎన్టీవీలో ఉంటోన్న ఆయ‌న కొద్ది రోజుల క్రితం అనూహ్య ప‌రిణామాల‌తో ఆ ఛానెల్ నుంచి బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు నెట్ట‌బ‌డ్డారు. ఆ త‌ర్వాత సాక్షి ఛానెల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

సాక్షిలో చేరిన‌ప్ప‌టి నుంచి వైసీపీకి అనుకూలంగా విశ్లేష‌ణ‌లు ఇస్తున్నార‌న్న టాక్ కూడా వ‌చ్చేసింది. ఇక ఒక‌ప్పుడు స‌మ‌ర్థ‌వంతంగా స‌మ‌తుల్య‌త‌తో ఉన్న కొమ్మినేని వెబ్‌సైట్ సైతం ఇప్పుడు వైసీపీ, జ‌గ‌న్‌కు డ‌ప్పు సైట్‌గా మారిపోయింద‌న్న అప‌వాదు కూడా మూట‌క‌ట్టుకుంది. వైసీపీలో చేరిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్‌, వైసీపీ వాయిస్ బ‌లంగా వినిపిస్తోన్న కొమ్మినేనికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో ఇంట‌ర్న‌ల్ టాక్ వినిపిస్తోంది.

కొమ్మినేని సాక్షి ఛానెల్ ద్వారా వైసీపీ వాయిస్‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతున్నాడ‌ని పార్టీ అధినేత జ‌గ‌న్ కూడా ఫుల్ ఖుషీగానే ఉన్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న లాంటి సీనియ‌ర్ వ్య‌క్తి చ‌ట్ట‌స‌భ‌ల్లో ఉంటే పార్టీకి ఇంకా ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తోన్న జ‌గ‌న్ కొమ్మినేనికి వైసీపీ త‌ర‌పున ఎంపీ సీటు ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

2019 ఎన్నిక‌ల్లో కొమ్మినేనిని గుంటూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ మీద పోటీ చేయాల‌ని సూచించార‌ట‌. ఒక వేళ గుంటూరు కాక‌పోతే అదే జిల్లాలోని న‌ర‌సారావుపేట నుంచి నుంచి అయినా ఎంపీగా పోటీ చేయిస్తే ఎలా ఉంటుంద‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నాడ‌ట‌. ఇక్క‌డ కొమ్మినేని రంగంలో ఉంటే అటు క‌మ్మ వ‌ర్గంతో పాటు రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఓట్లు కూడా ప‌డ‌తాయ‌న్న‌దే వైసీపీ ప్లాన్‌గా తెలుస్తోంది. మ‌రి కొమ్మినేనికి పొలిటిక‌ల్‌గా ఎలాంటి ల‌క్ ఉందో చూడాలి.