హోదా కంటే పున‌ర్విభ‌జ‌నే బాబుకు ఎక్కువా..?

`నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌ప‌న ఎప్పుడు చేస్తారు? వీలైనంత త్వ‌ర‌గా దీనిని చేప‌ట్టండి` అంటూ కేంద్ర పెద్ద‌ల‌ను క‌లిసిన‌ప్పుడ‌ల్లా ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే వారిని స‌ర్దిచెబుతున్నారు. ఆయ‌న‌కు కుద‌ర‌క‌పోతే.. టీడీపీ ఎంపీల‌తో కేంద్రంలోని బీజేపీ పెద్దల‌తో మంతనాలు జ‌రిగేలా చూస్తున్నారు. ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నియోజ‌క‌వ‌ర్గాల పెంపు జ‌రిగి తీరాల‌ని తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. హోదా విష‌యంలో ఇంత‌ట గ‌ట్టిగా ప్ర‌య‌త్నించ‌ని ఆయ‌న‌.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై ప‌డుతున్న ఆరాటం చూసి అంతా ఆశ్చ‌ర్య‌ప‌డుతున్నారు. హోదా విష‌యంలో ఇంతలా కృషి చేసుంటే.. బీజేపీ క‌చ్చితంగా పున‌రాలోచించేద‌ని చెబుతున్నారు.

రెండేళ్లలో ఎన్నిక‌లు.. పార్టీలో పెరుగుతున్న అసంతృప్తులు.. ప‌ద‌వుల కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్న‌ ఫిరాయింపు దారులు.. ఇలా సీఎం చంద్ర‌బాబు ముందు ఎన్నో స‌మ‌స్య‌లు! ఇప్ప‌టికే ఫిరాయింపుదారుల‌కు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం వ‌ల్ల సీనియ‌ర్లు ర‌గిలిపోయిన విష‌యం తెలిసిందే! దీంతో రాజ‌కీయంగా పార్టీకి కొంత డ్యామేజ్ ఏర్ప‌డింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇది మ‌రింత పెరిగే అవ‌కాశం కూడా ఉంది. దీనిని చ‌ల్లార్చేందుకు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశాన్ని టీడీపీ అధినేత తెర‌పైకి తీసుకొచ్చారు. దీంతో బీజేపీ ప్ర‌భుత్వంపై వీలైనంత‌గా ఆయ‌న తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఫిరాయింపు రాజ‌కీయాల‌కు పాల్ప‌డి, వైకాపా నుంచి చాలామంది నాయ‌కుల్ని ఆక‌ర్షించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి స్థానాలు కేటాయించ‌క‌పోతే మొద‌టికే మోసం త‌ప్ప‌ద‌న్న‌ది వాస్త‌వం. అందుకే, రాజ్యాంగ స‌వ‌ర‌ణ అవ‌స‌రం లేకుండా.. విభ‌జ‌న చ‌ట్టంలో ఒక క్లాజ్ ను కాస్త స‌వ‌రిస్తే చాల‌నీ, నియోజక వ‌ర్గాల సంఖ్య పెంచుకోవ‌చ్చంటూ ఈ విష‌యంలో కేంద్రానికి కూడా చంద్ర‌బాబు స‌ల‌హాలు ఇస్తున్నార‌ట‌! కేంద్ర‌మంత్రి వెంక‌య్య, సుజ‌నా చౌద‌రీల‌తో క‌లిసి భాజ‌పా జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాను క‌లుసుకుని.. నియోజ‌క వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా ప్రారంభించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని అమిత్ షాను కోరారు.

కొన్నాళ్ల కింద‌ట ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఏపీలో తీవ్రంగా సాగుతోంది. ఒక ప‌క్క ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌రోప‌క్క వైకాపా, ఇత‌ర రాజ‌కీయ పార్టీలు.. మూకుమ్మ‌డిగా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్ర‌య‌త్నం చేశాయి. అప్పుడు చంద్ర‌బాబుకు ఆహ్వానం పంపాయి. కానీ ఆయ‌న వాటిని ప‌ట్టించుకోకుండా.. కేంద్రానికి మ‌ద్ద‌తుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు పున‌ర్విభ‌జ‌న విష‌యంలో తీవ్రంగా బీజేపీపై ఒత్తిడి తెస్తున్నారు. ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కంటే, పార్టీ ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించి అంశాల్లోనే సీఎం స్పంద‌న ఇంత‌ చురుగ్గా ఉంటుందా.. అని అంతా ముక్కున‌వేలేసుకుంటున్నారు.