టీడీపీలో ఈ చౌద‌రి గారి శ‌ఖం ముగిసిన‌ట్టేనా..!

ఇటీవ‌ల మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌న‌కూ చోటు ద‌క్కుతుంద‌ని ఆశించిన టీడీపీ సీనియ‌ర్ నేత బుచ్చ‌య్య చౌద‌రి .. జాబితాలో త‌న‌పేరు లేక‌పోయేస‌రికి చాలా అసంతృప్తికి గురై.. ఒక‌డుగు ముందుకేసి పార్టీ ప‌ద‌వులకు రాజీనామా చేసేశారు. దీంతో అధిష్ఠానానికి చిర్రెత్తుకొచ్చింది. మిగిలిన వారిని ఏదో ర‌కంగా బుజ్జ‌గించినా.. ఆయ‌న్ను మాత్రం ప‌క్క‌న‌పెట్టేసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. ఇప్పుడు ఆయ‌న త‌న త‌ప్పు తెలుసుకున్నా.. ఆయన్ను పట్టించుకునే వారే క‌రువ‌య్యార‌ట‌. అంతేగాక ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌ను ప్రోత్స‌హించాల‌ని హైక‌మాండ్ నిర్ణ‌యించ‌డం ఆయ‌నకు కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఇక ఆయ‌న శ‌కం అయిపోయిన‌ట్టేన‌నే టాక్ వినిపిస్తోంది.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని బుచ్చ‌య్య చౌద‌రి.. ముఖ్యమంత్రిపై కొంత కాలంగా ఒత్తిడి తెస్తున్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవికి రాకపోవడంతో బహిరంగంగా పార్టీపై ధ్వజమెత్తారు. అంతే కాకుండా ముందూ వెనుక చూసుకోకుండా పార్టీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అధిష్టానానికి మండింది. మంత్రి వర్గ విస్తరణ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, బోండా ఉమామహేశ్వరరావు,బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పయ్యావుల కేశవ్‌, దూళ్లిపాళ నరేంద్ర వంటి నేతలను అధినాయకుడు బుజ్జగించారు. వారే కాకుండా మంత్రి పదవులు ఆశించిన వారిని కూడా ఆయన ఏదో రకంగా సర్దిచెప్పారు.

ఒక్క బుచ్చయ్య చౌదరి విషయంలో మాత్రం అధినేత పట్టనట్లు ఉండిపోయారు. దీంతో అధిష్టానంపై కత్తి దూసిన బుచ్చయ్యచౌదరికి.. ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోవడం లేద‌ట‌! అందరిలానే తననూ బుజ్జగిస్తారని ఆశించిన ఆయనకు ఇప్పుడు తీవ్ర నిరాశ ఎదుర‌వుతోంద‌ట‌. మరో వైపు పార్టీ పదవులకు రాజీనామా చేయటంతో రాజమండ్రిలో ఆయన ప్రత్యర్థులు పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో పార్టీ తనను అంటరాని వాడిలా చూస్తుందన్న ఆవేదన ఆయనలో వ్యక్తం అవుతోంది. తనను పిలిచి మాట్లాడితే సర్దుకుపోతానని సంకేతాలు ఆయన ఇస్తున్నా… ఆయన్ను పట్టించుకునే వారు కరువయ్యార‌ట‌.

బుచ్చ‌య్య చౌద‌రి విష‌మంలో సీఎం చంద్ర‌బాబు మాత్రం మ‌రో రకంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తి వ్యక్తం చేసిన బుచ్చయ్యను పక్కన పట్టేసి ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఆయ‌న ఉన్నార‌ట‌. మొత్తం మీద ఇక బుచ్చయ్య పని అవుట్‌ అయినట్లేన‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది. కత్తి దూసి యుద్ధం రంగంలోకి దిగి ఇప్పుడు మ‌ధ్య‌లోనే ఆలోచిస్తున్నార‌ని బుచ్చయ్య అనుచరులు వాపోతున్నారట‌.