`ముంద‌స్తు` ముందు బాబుకు స‌వాళ్లు

ముంద‌స్తు ఎన్నిక‌ల హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాల‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టినుంచే శ్రేణుల‌ను అల‌ర్ట్ చేస్తున్నారు. పైకి మాట‌లు గ‌ట్టిగా చెబుతున్నా.. ఆయ‌న‌లోనూ ముంద‌స్తు బెంగ ఉంద‌ని పార్టీ నేత‌లు అంత‌ర్గ‌తంగా గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఒక‌పక్క రాష్ట్రంలో నివురు గ‌ప్పిన నిప్పులా ప్ర‌జల్లో అసంతృప్తి, మ‌రో ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై స్ప‌ష్ట‌మైన క్లారిటీ రాక‌పోవ‌డం.. వీట‌న్నింటికీ మించి అచ్చిరాని `ముంద‌స్తు ఎన్నిక‌ల‌` సెంటిమెంట్‌.. ఇన్ని స‌మ‌స్య‌ల మ‌ధ్య ఎన్నిక‌ల‌కు వెళితే ఎలా నెగ్గుకురావాల‌నే బెంగ ఇప్పుడు చంద్ర‌బాబుతో పాటు తెలుగు తమ్ముళ్ల‌లో మొద‌లైంద‌ట‌.

దేశ రాజకీయాల్లోనే కాదు ఏపీ రాజకీయాల్లోనూ ముందస్తు మాట వినిపిస్తోంది. దీంతో కనీసం ఆర్నెళ్ల ముందుగా ఎన్నికలు రావడం గ్యారంటీ అన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే `ముందస్తు` మాట వింటేనే చాలు టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు. ముందస్తు ఎన్నికలు తమకు అచ్చిరావని, గతంలో అలిపిరి ఘటనలో చంద్రబాబు చావు తప్పించు కున్నప్పుడు ఆ సెంటిమెంటు వర్కవుట్ అవుద్దని ముందస్తు ఎన్నికలకు వెళ్లి దెబ్బతిన్న సంగతి గుర్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా తీవ్రంగా ఉందని..  కొంచెం టైముంటే మంచి పనులు చేసి జనాల్లోకి వెళ్ల‌వ‌చ్చిన , కానీ ఇప్పటికప్పుడు ఎన్నికలకు వెళ్తే దెబ్బతిన‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

కార్య‌క‌ర్త‌లు, నేత‌ల ప‌రిస్థితి ఇలా ఉంటే.. కొత్త‌గా మంత్రి ప‌ద‌వి పొందిన వారి కష్టాలు మ‌రోలా ఉన్నాయి. ఇంకా ఉన్నది రెండేళ్లేనని.. ముందస్తు పేరుతో అందులో ఆరేడు నెలలు మింగేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఒకే నియోజకవర్గంలో టిక్కెట్లు ఆశిస్తున్న వారు కూడా.. ఇప్పటి నుంచే ఖర్చు పెట్టాలా.. లేదంటే కాస్త ఆగాలా అన్న విషయంలో క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. నియోజకర్గాలు పెరుగుతాయో లేదో తెలీదు. ఏ ఏరియాలో ఖర్చు చేయాలి.. ఎక్క‌డ‌ ప్రచారం చేసుకోవాల‌నేది ప్ర‌శ్న‌! పెంపుపై క్లారిటీ ఇచ్చి త‌ర్వాత‌ ముందస్తు ఎన్నికల విషయంలో స్పష్టత ఇవ్వాలని వీరు కోరుతున్నారు.

సీట్లు పెర‌గ‌ని ప‌క్షంలో పార్టీలో జ్వాల‌లు రేగడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలోనే సీట్ల కొట్లాట ఓ రేంజిలో ఉంది. నియోజ‌క‌వ‌ర్గాలు పెరగకుంటే రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉండొచ్చ‌నేది స్ప‌ష్టంగా తేలింది, మ‌రి ఈ విషయంలో చంద్ర‌బాబు.. బీజేపీపై  ఇప్ప‌టినుంచే ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కూ ఫ‌లిస్తాయో వేచి చూడాల్సిందే!!