ముందు త‌మ్ముడు..తర్వాత అన్న టీడీపీకి గుడ్ బై..!

నెల్లూరు జిల్లా టీడీపీలో ముస‌లం మొద‌లైంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన.. ఆనం సోదరులు ఇప్పుడు పార్టీలో ఇమ‌డ‌లేక‌పోతున్నారు. పార్టీలో చేరినా త‌మ‌ను పట్టించుకోవ‌డం లేద‌ని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అలాగే పార్టీలో చేరిన స‌మ‌యంలో ఇచ్చిన హామీని కూడా నెర‌వేర్చక‌పోవ‌డంతో నొచ్చుకున్నార‌ట‌. దీంతో ముందుగా త‌మ్ముడు.. త‌ర్వాత అదే బాట‌లో అన్న టీడీపీని వీడే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌మ‌ను అవ‌స‌రానికి వాడుకుంటున్నార‌ని ఆనం వివేకానంద‌రెడ్డి వ‌ర్గీయులు ఆగ్ర‌హంతో ఉన్నార‌ట‌. ఇక టీడీపీని వీడి వైసీపీలో చేర‌డం ఖాయ‌మ‌ని అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకుంటున్నారు.

ఆనం సోదరులు కాంగ్రెస్‌లో 20 ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగారు. సొంత కేడర్‌తో వ్యవహారాలు సాగిస్తూ  నెల్లూరు జిల్లాలో ప‌ట్టు సాధించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ సంక్షోభంలో కూరుకుపోవ‌డంతో త‌మ‌ రాజకీయ భవిత్యం కోసం టీడీపీలో చేరడం సముచితమని భావించి.. తమ అనుచరులతో సైకిలెక్కేశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రామనారాయ ణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌చార్జి బాధ్యతలు, వివేకాకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆరు నెలల తరువాత ఆత్మకూరు ఇన్‌చార్జి బాధ్యతలు రామనారాయణరెడ్డికి అప్పగించారు. కాని వివేకాకు ఇస్తామన్న ఎమ్మెల్సీ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో వివేకా వ‌ర్గం తీవ్రంగా అస‌హ‌నానికి గుర‌వుతోంద‌ట‌.

మొదటి నుంచి పార్టీలో చేరడం ఇష్టం లేకపోయినా సోదరుడి కోసం ఆనం వివేకానందరెడ్డి సైకిలెక్కారు. పార్టీలో చేరిన నాటి నుంచి ఎన్నో అవమానాలకు గురవుతున్నానని ఆయ‌న‌ తన ఆత్మీయుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. `మా అవసరం వచ్చినప్పుడు వారే పిలుస్తారు… ఇన్నాళ్లు సామాన్య కార్యకర్తగానే వ్యవహరించాను. ఏముంది గుర్తింపు? మాకు ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి వాయిదా వేస్తూ పోతున్నారు. క‌నీసం ప‌రిగ‌ణ‌న‌లోకి కూడా తీసుకోలేదు. ఇక పార్టీలో ఉండ‌టం వృథా` అని ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నార‌ట‌. ఇక పార్టీని వీడే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఆయన వర్గీయులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

జిల్లా టీడీపీ నేతల దారుణాలకు హద్దు, అదుపు లేదని విమ‌ర్శిస్తున్నారు. తాను పార్టీలో ఉంటే నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజకవర్గాల గెలుపు సాధ్యమని అలాంటిది తనను విస్మరించడం ఎంతో బాధ కలిగిస్తుందని వాపోతున్నట్లు వివేకా అనుచరులు చర్చించుకుంటున్నారు. ఇక కేవలం ఆత్మకూరుకే పరిమితమైన వ్యవహారాలు నడపడంతో జిల్లా నేతలతో రామ‌నారాయ‌ణ‌రెడ్డికి పెద్దగా సఖ్యతగా ఉండటం లేదు. రామనారాయణరెడ్డి మాత్రం టీడీపీలోనే మరి కొద్ది రోజులు కొనసాగుతారని, సముచిత స్థానం కల్పిస్తే కొనసాగడమా లేదా ఆయన కూడా పార్టీ వీడుతారా అన్న చర్చ కూడా నడుస్తోంది.