ఏపీలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ థ‌ర్డ్ పేజ్ స్టార్ట్‌ … అయితే వైసీపీ అవుట్ ?

ఏపీ సీఎం చంద్ర‌బాబు విప‌క్షాన్ని మ‌రింత నిర్వీర్యం చేసేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ థ‌ర్డ్ పేజ్ స్టార్ట్ చేస్తున్నారా ?  థ‌ర్డ్ పేజ్‌లో విప‌క్ష వైసీపీలో మ‌రిన్ని కీల‌క వికెట్లు ప‌డ‌నున్నాయా ?  అంటే ఏపీ రాజ‌కీయవర్గాల్లో ప్రస్తుతం ఇదే అంశం జోరుగా ట్రెండ్ అవుతోంది. దివంగ‌త నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీ ఎంట్రీతో స్టార్ట్ అయిన ఫ‌స్ట్ పేజ్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌, బొబ్బిలి ఎమ్మెల్యే సుజ‌య్‌కృష్ణ రంగారావుతో సెకండ్ పేజ్ ఆప‌రేష‌న్లు స‌క్సెస్ అయ్యాయి.

ఈ రెండు ఆప‌రేష‌న్ల దెబ్బ‌తో మొత్తం 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు చెంత‌కు చేరారు. ఇక మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న కూడా పూర్త‌వ్వ‌డంతో చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా స్కెచ్‌లు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీని మ‌రింత బ‌ల‌హీనం చేసేందుకు ఆప‌రేష‌న్ థ‌ర్డ్ పేజ్‌కు తెర‌లేపుతున్నారు. ఆప‌రేష‌న్ థ‌ర్డ్ పేజ్‌లో మొత్తం 10 వికెట్లు ప‌డేందుకు రెడీగా ఉన్నాయ‌ట‌.

వీరిలో ముందుగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్ద‌రు ఎమ్మెల్యేలు  సైకిలెక్క‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ జిల్లాలో వైసీపీ గెలిచిన మూడు సీట్ల‌లో పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే క‌ల‌మ‌ట వెంక‌ట‌ర‌మ‌ణ ఇప్ప‌టికే సైకిలెక్కేశారు. ఇప్పుడు పాల‌కొండ ఎమ్మెల్యే విశ్వ‌న‌రాయ క‌ళావ‌తి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ప‌సుపు కండువా క‌ప్పుకోనున్న‌ట్టు స‌మాచారం. ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు కిమిడి క‌ళా వెంక‌ట‌రావుతో ఇప్ప‌టికే వీరిద్ద‌రి చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయ‌ని తెలుస్తోంది.

ఇక కృష్ణా జిల్లా నుంచి నూజివీడు, తిరువూరు ఎమ్మెల్యేలు ప్ర‌తాప్ అప్పారావు, ర‌క్ష‌ణ‌నిధి సైతం ప‌సుపు కండువా క‌ప్పుకునేందుకు సిద్ధంగానే ఉన్నార‌ట‌. వీరితో పాటు క‌డ‌ప, క‌ర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కూడా ఒక్కో ఎమ్మెల్యే పేర్లు జంపింగ్ లిస్టులో ఉన్నాయ‌ని స‌మాచారం.