అఖిల‌ప్రియ‌కు మంత్రిగా ఎన్ని అగ్నిప‌రీక్ష‌లో…!

ఏపీ కేబినెట్‌లో అతిపిన్న వ‌య‌స్సులోనే మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన భూమా అఖిల‌ప్రియ ప‌రిస్థితి ముందు నుయ్యి – వెన‌క గొయ్యి అన్న చందంగా మారింది. అఖిల‌ప్రియ ఎమ్మెల్యేగా ఎన్నికైనా తండ్రి అడుగుజాడ‌ల్లోనే ఉండేవారు. ఆమె పేరుకు మాత్ర‌మే ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేగా ఉన్నా బ‌ల‌మైన ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు వేదికైన అక్క‌డ వ్య‌వ‌హారాల‌న్ని భూమానే చ‌క్క‌పెట్టేవారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు.

కానీ ఇప్పుడు అలా కాదు ప‌రిస్థితి మారింది. ఆళ్ల‌గ‌డ్డ‌తో పాటు నంద్యాల‌లోను ఆమె బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. రేపు నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో అఖిల‌ప్రియ చెల్లిని బ‌రిలో ఉంచుతార‌న్న టాక్ వ‌స్తోంది. అదే జ‌రిగితే రాజ‌కీయంగా చాలా చిన్న వ‌య‌స్సులోనే అఖిల్ పెద్ద పెద్ద స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భూమా జీవించి ఉండ‌గా అఖిల‌కు రాజ‌కీయం నేర్పేవారు. ఆళ్ల‌గ‌డ్డ నుంచి ఎవ‌రైనా త‌ను క‌లిసేందుకు వ‌స్తే మీ ఎమ్మెల్యే అఖిల‌ప్రియ ఆమెతోనే మాట్లాడండి అనేవారు. అయితే ఆయ‌న ఆక‌స్మిక మ‌ర‌ణంతో అఖిల ఇప్పుడు రాజ‌కీయంగా త‌ల‌కు మించిన భారాన్ని మోయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ప్రస్తుతం మంత్రిగా అఖిలప్రియ బాధ్యతలు చేపట్టడంతో అటు నంద్యాల, ఇటు ఆళ్లగడ్డ అభివృద్ధి బాధ్యతలను ఆమె మోయాల్సి ఉంటుంది. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో తండ్రి హామీ ఇచ్చిన అభివృద్ధి ప‌నులు నెర‌వేర్చ‌డంతో పాటు ఇటు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ఆళ్లగడ్డను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఆమెకు సవాల్‌ లాంటివే.

ఇదిలా ఉంటే ఫ్యాక్ష‌న్‌కు కేరాఫ్ అయిన ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల‌లో ఆమె విప‌క్షాన్ని ఎదుర్కోవ‌డంతో పాటు ఇటు సొంత పార్టీలోను గ్రూపుల‌ను స‌మ‌న్వయం చేసుకుంటూ వెళ్లాల్సి ఉంది. నంద్యాల‌లో శిల్ప సోద‌రుల‌ను క‌లుపుకుని వెళ్ల‌డం ఆమె పెద్ద అగ్నిపరీక్షే. ఇక అటు ఆళ్లగడ్డలోను ఒకే పార్టీలో భూమా, ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా ఈ రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్‌, రాజకీయ వైరం ఉంది.

రాజ‌కీయంగా కేవ‌లం మూడేళ్ల వ‌య‌స్సు ఉన్న అఖిల ద‌శాబ్దాలుగా త‌ల‌పండిన సీనియ‌ర్ల‌ను క‌లుపుకుని వెళ్లాల్సి ఉంది. కాస్తో కూస్తో ఆమెకు ఊర‌ట ఏంటంటే ఆమెకు అండ‌గా మేన‌మామ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ.మోహ‌న్‌రెడ్డి ఉన్నారు. మ‌రి నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్లో అఖిల‌ప్రియ ఎలా నెగ్గుకు వ‌స్తుందో చూడాలి.