మూడేళ్ల జ‌న‌సేన ఇన్న‌ర్ రిపోర్ట్‌

ప్ర‌శ్నించ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పాడు ప‌వ‌న్‌!! ఇలా చెప్పి మూడేళ్లు పూర్త‌యింది. అడ‌పాద‌డ‌పా రావ‌డం.. ఆవేశంగా మాట్లాడ‌టం.. కొన్ని స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్ల‌డం.. త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన వారికి ఒకేసారి బ‌దులు చెప్ప‌డం.. ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన‌పుడు ట్విట‌ర్‌లో నాలుగు ముక్క‌లు రాసేయ‌డం.. మిన‌హా ఈ మూడేళ్ల‌లో ప‌వ‌న్ పెద్ద విజ‌యాలు సాధించ‌లేద‌నే చెప్పాలి. పవన్ కు ఉన్న ఫాలోయింగ్ తో ఆయనపై పొలిటికల్ ఎంట్రీపై బాగానే ఆశలు పెట్టుకున్నారు. ప్రజల సమస్యలపై సమరశంఖారావం పూరిస్తారని ఊహించారు. కానీ వాస్తవం చూస్తే వాళ్ల అంచ‌నాలు తల్ల‌కిందుల‌య్యాయ‌నే వాద‌న వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో అనేక సమస్యలు ఉన్నాయి! కానీ వాటిపై పవన్ ఊహించిన రీతిలో స్పందించడం లేదనేది మొదటి ఆరోపణ. ముఖ్యంగా అనేకమంది జీవితాన్ని అతలాకుతలం చేసిన విషయాల్లో పవన్ స్పందన అంతంత మాత్రమే కాదు… అసలే మాత్రం లేదనేది కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గత ఏడాది ఏపీ సర్కారు ఎంతో అట్టహాసంగా నిర్వహించిన గోదావరి పుష్కరాల్లో 20మందికి పైగా మరణించారు. కానీ దీనిపై ప్ర‌భుత్వాన్ని నిలదీసిన దాఖలాలు లేవు. తాజాగా జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపైనా అస్స‌లు నోరు మొద‌ప‌లేదు.

ఇక పవన్ స్పందించిన పలు విషయాల్లోనూ అర్దాంతరంగా ముగించడమో లేక పరిష్కారం కాకముందే వాటిని వదిలిపెట్టడమో చేశారనే మరో కామెంట్. ఏపీకి కీలక అంశమైన ప్రత్యేక హోదా విషయంలో ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలి భిన్నంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలైన కాంగ్రెస్ – కమ్యూనిస్టులు – పెద్ద ఎత్తున యువతీ యువకులు కలిసికట్టుగా గళం విప్పినప్పటికీ పవన్ వారితో కలవలేదు. అదే సమయంలో తన సొంత కార్యచరణతోనూ ప్రత్యేక హోదా కోసం ఉద్య‌మం చేపట్టలేదు. కొన్ని పాటలను జ‌నసేన తరఫున విడుదల చేశారు! మరోవైపు కీలకమైన రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల విషయంలోనూ పవన్ వారి పక్షాన ఉన్నట్లే కనిపించింది.

ఆ సమస్యలు పూర్తి పరిష్కారం కాకముందే పవన్ సైడ్ అయిపోయారు. ఇక ఏపీలో జరుగుతున్న అవినీతి – ఎమ్మెల్యేలు-ఎంపీలు-ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టి అధికార పార్టీ తన గూటికి చేర్చుకోవడంపై పవన్ గళం వినిపించిన దాఖలాలు లేవు. ఓటుకు నోటు వంటి కీలక అంశాల్లోనూ పవన్ వాయిస్ పరిమితంగా కూడా కనిపించలేదు! వీటన్నింటినీ చూస్తుంటే మూడేళ్లు అయినా పవన్ ఇంకా ప్రజల పల్స్ పట్టుకోలేదా అనే సందేహం కలగడంలో వింతేం లేదంటున్నారు. ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌ల్లో ఉండేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌.. పార్ట్‌టైమ్ గా కాకుండా ఫుల్ టైం రాజ‌కీయాల్లోకి వ‌స్తే బాగుంటుంద‌ని కొంద‌రి భావ‌న!