అమిత్ మ్యాజిక్ ఇక్క‌డ ప‌ని చేస్తుందా..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం సాధించిన అనంత‌రం.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొల్పుతోంది. ముఖ్యంగా షా త‌దుప‌రి ల‌క్ష్యం తెలంగాణ అని ఇప్ప‌టికే సంకేతాలు వెలువ‌డిన నేప‌థ్యంలో.. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారని అంద‌రూ ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ‌లో బ‌ల‌మైన నాయకుడిగా మారిన కేసీఆర్‌ను.. షా ఎలాంటి వ్యూహాలు ర‌చిస్తారు? మ‌రి అంద‌రిలానే అమిత్ షా వ‌ల‌లో కేసీఆర్ చిక్కుతాడా? అనే సందేహాలు అంద‌రిలోనూ మొద‌లయ్యాయి!!

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో పార్టీ అఖండ విజయాల నేపథ్యం లో తెలంగాణలోనూ మోదీ మ్యాజిక్‌ పనిచేసేలా ముందుకు సాగాలని రాష్ట్ర బీజేపీ ఉవ్విళూరుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మిషన్‌ 2019కు కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలతోపాటు మోదీ అభివృద్ధి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా.. ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ముస్లిం రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనతోపాటు ఉద్యోగాల భర్తీ, డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో జాప్యం, ఎస్సీల భూపంపిణీ, రైతాంగ, సింగరేణి కార్మికుల సమస్యలపై టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టాలని రాష్ట్ర బీజేపీ భావిస్తోంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ, ఏపీ, ఒడిశాలలో బీజేపీ గణనీయమైన ఫలితాలు సాధించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని వివిధ నివేదికల్లో స్పష్టమైందని పార్టీ నాయకులకు అమిత్ షా గతంలోనే తెలిపారు. దీంతో కేసీఆర్‌పై యుద్ధ‌మే ల‌క్ష్యంగా ఇప్పుడు బ‌రిలోకి దిగ‌బోతోంది. ఇప్ప‌టికే టీఆర్ఎస్‌కు కూడా లేన‌ట్టుగా 31 జిల్లాల్లో క‌మిటీల‌ను ఏర్పాటుచేసుకుంది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ బ‌ల‌హీనంగా ఉన్నందున ప్ర‌ధాన ప్ర‌తిపక్షంగా మారి.. పోరాటాలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని భావిస్తోంది. ప్ర‌జ‌ల్లో ఉన్న అసంతృప్తిని అనుకూలంగా మ‌లుచుకుని.. ప్ర‌భుత్వంపై పోరాడేందుకు ఇప్ప‌టికే వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.

రాష్ట్ర పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వచ్చే నెలలో నల్లగొండ, మెదక్‌ తదితర జిల్లాల్లో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రభావాన్ని ఆయన అంచనా వేయనున్నారు. ఈ పర్యటన తర్వాత జాతీయ నాయకత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలోకి రాష్ట్ర పార్టీ వెళ్లనుంది. జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాల్లో అనుసరించే వ్యూహాలను, ఇక్కడ అమలు చేసి పూర్తి ఫలితాలను రాబట్టాలనే ఆలోచనతో జాతీయనాయకత్వం ఉంది. మ‌రి అమిత్ షా మ్యాజిక్.. తెలంగాణ‌లో ఎంత‌వ‌ర‌కూ ప‌నిచేస్తుందో వేచిచూడాల్సిందే!!