కేంద్రం నియోజ‌క‌వ‌ర్గాల‌ పెంపు…బాబుకి కొత్త జిల్లాల డిమాండ్

ఏపీలో ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అంశం తెర‌పైకి వ‌చ్చింది. విభ‌జ‌న త‌ర్వాత రెండు రాష్ట్రాల్లోనూ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు ప్ర‌తిపాద‌న అంశాన్ని కేంద్రం ప‌క్క‌న పెట్టింది. అయితే కొన్ని రోజులుగా ఈ అంశంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికే నియోజ‌క‌వ‌ర్గాలను పెంచాల‌ని కేంద్రం నిర్ణ‌యించింద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకో ఆసక్తిక‌ర అంశం ఏంటంటే.. నియోజ‌క‌వ‌ర్గాలే గాక‌.. ఇప్పుడు కొత్త జిల్లాల అంశం తెర‌పైకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాలకు తోడు మరో 10 జిల్లాలు అద‌నంగా ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ పెరుగుతోంది.

ఇటీవ‌లే తెలంగాణ‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ‌ను విజ‌యవంతంగా పూర్తిచేశారు తెలంగాణ సీఎం కేసీఆర్‌! ఎన్నో డిమాండ్‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కొత్త జిల్లాల‌ను ఏర్పాటుచేశారు. ఇప్పుడు అదే బాట‌లో ఏపీలోనూ కొత్త జిల్లాల డిమాండ్ పెర‌గ‌బోతోంది. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గాల‌ను 175 నుంచి 225కు మార్చాల‌ని కేంద్రం భావిస్తోంది. ఇదే స‌మ‌యంలో జిల్లాల‌ను కూడా పెంచాలనే ఒత్తిడి అధిక‌మవుతోంది. ప‌రిపాల‌న సుల‌భ‌మవుతుంద‌ని, రాజకీయంగా ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ‌తీసేందుకు, అన్ని ప్రాంతాలు స‌మానంగా అభివృద్ధి చెందేందుకు జిల్లాల పెంపు దోహ‌ద‌ప‌డుతుంద‌ని కొంద‌రు చెబుతున్నారు. వీరి ప్ర‌కారం..

ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌ను తూర్పు, ప‌శ్చిమ ప్రాంతాలుగా విభ‌జించాల‌ని కోరుతున్నారు. మ‌చిలీ ప‌ట్నం జిల్లా ముఖ్య కేంద్రంఅయినా.. విజ‌య‌వాడే వాణిజ్య రాజ‌ధానిగా ఉండ‌టంతో.. తూర్పు ప్రాంతం వెనుక‌బ‌డింద‌ని చెబుతున్నారు. అలాగే గుంటూరు రాజ‌ధాని క‌నుక‌.. ఢిల్లీలోని ఎన్‌సీఆర్ త‌ర‌హాలో అమ‌రావ‌తి మిగిలిన ప్రాంతం మ‌రొక‌టి చేయాల‌ని ప్ర‌తిపాదిస్తున్నారు. ఇక అభివృద్ధికి ఆమ‌డ దూరంలో ఉన్న ప్ర‌కాశాన్ని కూడా.. రెండుగా విభ‌జిస్తే.. నీరు లేని ప్రాంతంపై ప్ర‌త్యేకంగా దృష్టిపెట్ట‌వ‌చ్చని తెలుస్తోంది. అలాగే శ్రీ‌శైలాన్ని కూడా జిల్లా చేయాల‌ని కోరుతున్నారు. ఇక నెల్లూరులోని గూడురు, వెంక‌ట‌గిరిని తిరుపతిలో క‌లిపి.. మొత్తం బాలాజీ జిల్లా చేయాల‌ని సూచిస్తున్నారు.

ఇక అనంత‌పురంలోని గుంత‌క‌ల్లును కూడా జిల్లా చేయాల‌ని, త‌ద్వారా క‌రువు ప‌రిస్థితుల‌పై దృష్టిసారించ‌వ‌చ్చిన చెబుతున్నారు. క‌ర్నూలులోని కొన్ని ప్రాంతాలు కూడా క‌లిస్తే అన్నింటిని అభివృద్ధి చేయ‌వ‌చ్చ‌ని స్ప‌ష్టంచేస్తున్నారు. ఇక క‌డ‌ప‌లోనూ ప్రొద్దుటూరును జిల్లా చేయాల‌ని కోరుతున్నారు. ఇలా కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తే ఇక పాల‌న సుల‌భ‌మ‌వుతుంద‌ని కొంద‌రు వివ‌రిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే తెలంగాణ‌లో జిల్లాల చిచ్చు ఎక్క‌డో ఒక చోట ర‌గులుతూనే ఉంది. మ‌రి వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో!!