భూమా మృతికి సంతాప‌మా? ఎన్నిక‌ల ప్ర‌చారమా?

కాదేదీ క‌వితక‌నర్హం అన్నాడో మ‌హాక‌వి!! ఇప్పుడు కాదేదీ రాజ‌కీయాల‌క‌న‌ర్హం అంటున్నారు రాజ‌కీయ నాయ‌కులు! ఏ అంశాన్న‌యినా రాజ‌కీయాన్ని చేసి.. దానిని త‌మ అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకోవ‌డం ప్ర‌స్తుత రాజ‌కీయ నాయ‌కుల‌కు వెన్నతో పెట్టిన విద్య‌! క‌రెక్టుగా ఇప్పుడు భూమా నాగిరెడ్డి మ‌ర‌ణాన్ని కూడా ఎవ‌రికి వారు.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. చివ‌రికి ఆయ‌న‌కు సంతాప స‌భ కూడా రాజ‌కీయాల‌కు వేదిక‌గా మారిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం!!

ఒక నాయకుడు మృతి చెందిన వెంటనే ఆ నాయకుడికి, ఆ నాయకుడి కుటుంబానికి అండగా నిలవాలన్న స్పృహ కంటే.. ఆరునెలల్లో ఎదుర్కోబోయే ఉప ఎన్నికల గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు నాయకులు. చనిపోయిన ఎమ్మెల్యే సీటును గెల్చుకోవడం కోసం చేసే ప్రచారానికి ప్రారంభంగా సంతాప తీర్మానాలు, సభలను వాడేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం భూమానాగిరెడ్డిని అధికార పార్టీవాళ్ళు ఇబ్బంది పెట్టిన మాట వాస్త‌వం. అనేక కేసులు మోపి.. ఆయ‌న్ను మానసికంగా వేధించారు. ఇదే విష‌యాన్ని పార్టీ మారుతున్నసందర్భంలో ఆ విషయాన్ని స్వయానా భూమా నాగిరెడ్డే చెప్పారు.

ఇక మంత్రి ప‌ద‌వి కోసం.. ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాల‌కు అడుగ‌డుగునా వాళ్ల వ్య‌తిరేక‌వర్గం అడ్డుప‌డుతూనే ఉంది. తెలంగాణ‌లో తలసాని శ్రీనివాసయాదవ్‌ని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు గవర్నర్‌ని చంద్రబాబు నానా రకాలుగా విమర్శించారు. అది కూడాపెద్ద సమస్యగా మిగిలింది. ఇప్పుడు ఇవ‌న్నీ ఒప్పుకునే స్థితిలో చంద్ర‌బాబు లేనేలేరు. అలాగే ఈ సిచ్యుయేషన్‌ని రాజకీయంగా ఉపయోగించడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాడు ప్ర‌తిప‌క్ష నేత‌ జగన్. తనకు బాగా పట్టున్న కర్నూలు జిల్లాలో ఉపఎన్నిక కావడంతో కచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నారు.

ఇదే స‌మ‌యంలో భూమా మృతికి చంద్ర‌బాబు ప‌రోక్ష కార‌ణ‌మనే ప్ర‌చారం చేసి.. ఆయ‌న్ను విల‌న్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు జ‌గ‌న్!! వాడుకుని వ‌దిలేస్తాడు అనే ప్ర‌చారాన్ని ఇంకాస్త బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నాడు. మొత్తంగా అటు అధికార ప‌క్షం, ఇటు విప‌క్షం కూడా సంతాపం పైన గాక‌.. వ‌చ్చే ఉప‌ ఎన్నిక‌ పైనే దృష్టిసారించాయ‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది!! అన్నింటినీ రాజ‌కీయ కోణంలోనేగాక‌.. మాన‌వీయ కోణంలోనూ చూడాల‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం!