ప్రభుత్వం పై వ్య‌తిరేక‌త ఇది… దిమ్మ‌తిరిగే రిజ‌ల్ట్‌

ఏపీలో మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. సోమ‌వారం స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల్లో మూడు జిల్లాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో మూడింట  మూడు స్థానాలు గెలుచుకోవ‌డంతో అధికార టీడీపీ చేసిన హంగామాకు అంతే లేదు. క‌డ‌ప‌, క‌ర్నూలు, నెల్లూరు మూడు జిల్లాల్లో లోక‌ల్ బాడీస్ ఎమ్మెల్సీల‌ను టీడీపీ గెల‌చుకున్నా ఈ గెలుపుకోసం టీడీపీ ప్ర‌లోభాలు, బెదిరింపులు లెక్క‌లోకి రాలేదు.

ఇక ప్ర‌లోభాలు, బెదిరింపుల‌కు తావులేని టీచ‌ర్స్‌, గ్రాడ్యుయేట్స్ నియోజ‌క‌వర్గాల ఫ‌లితాలు కాస్త లేట్‌గా వ‌చ్చాయి. ఈ ఫ‌లితాలు వ‌చ్చాక కానీ టీడీపీ వాళ్ల‌కు, చంద్ర‌బాబుకు అసలు జ్ఞానోద‌యం అయిన‌ట్టు లేదు. ఈ ఎన్నిక‌ల్లో విప‌క్ష వైసీపీ టీడీపీ కంటే పూర్తి అప్ప‌ర్ హ్యాండ్ సాధించింది. ఈ  ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ బలపరచిన అభ్యర్థులకు పట్టభద్రులు పట్టం కట్టారు.

పట్ట‌భ‌ద్రుల‌కు సంబంధించి మొత్తం మూడు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇందులో రెండు సీట్లు వైసీపీ స‌పోర్ట‌ర్స్‌కే ద‌క్కాయి. ఉత్త‌రాంధ్ర‌లో మాత్రం టీడీపీ మ‌ద్ద‌తు ఇచ్చిన బీజేపీ అభ్య‌ర్థి గెలుపొందారు. ఉత్త‌రాంధ్ర గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీవీఎస్ మాధవ్ దక్కించుకున్నారు. ఆయ‌న త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి పీడీఎఫ్‌కు చెందిన అజా శ‌ర్మ‌పై 9215 ఓట్లే తేడాతో గెలుపొందారు.

ఇక తూర్పు రాయ‌ల‌సీమ‌, ప‌శ్చిమ రాయ‌ల‌సీమ రెండు చోట్లా టీడీపీ అభ్య‌ర్థులు మ‌ట్టి క‌రిచారు. నెల్లూరు – ప్ర‌కాశం – చిత్తూరుల‌తో ఉన్న తూర్పు రాయ‌ల‌సీమ గ్రాడ్యుయేట్స్ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ బలపరచిన పీడీఎఫ్ అభ్యర్థి యండవల్లి శ్రీనివాసులు రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయ‌న టీడీపీ నుంచి పోటీ చేసిన వేమిరెడ్డి ప‌ట్టాభి రామిరెడ్డిని 3500 ఓట్ల‌తో ఓడించారు. షాక్ ఏంటంటే ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు కూడా ఉంది.

ఇక పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ స్థానం విషయానికి వస్తే… అనంతపురం – కర్నూలు – కడప జిల్లాల గ్రాడ్యుయేట్ ఓట్లతో కూడిన ఈ స్థానాన్ని ఇటు అధికార పార్టీతో పాటు అటు విపక్ష వైసీపీ కూడా ప్రతిష్ఠాత్మకంగానే భావించాయి. ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన వెన్న‌పూస గోపాల్‌రెడ్డి టీడీపీ అభ్య‌ర్థి కేజీ రెడ్డిని 14146 ఓట్ల భారీ తేడాతో ఓడించారు.

ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గాల్లోను టీడీపీకి త‌ప్ప‌ని ప‌రాభ‌వం :

సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఉపాధ్యాయులు కూడా టీడీపీని ప్రజలు తిరస్కరించారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో  ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం చేతిలో టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడు మట్టికరిచారు. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలతో కూడిన పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ స్థానంలో పీడీఎఫ్‌ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి చేతిలో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ అయిన టీడీపీ అభ్యర్థి బచ్చల పుల్లయ్య దారుణంగా ఓటమి పాలయ్యారు.

సో ఈ రిజ‌ల్ట్‌ను బ‌ట్టి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌ట్ల ప్ర‌జ‌ల ఎంత వ్య‌తిరేక‌త‌తో ఉన్నారో అర్థ‌మ‌వుతోంది. మ‌రి ఈ 8 ఎమ్మెల్సీ ఫ‌లితాల్లో ఉపాధ్యాయులు, విద్యావంతులైన గ్రాడ్యుయేట్స్‌లో బాబు ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.