హైద‌రాబాద్‌లో కాట‌మ‌రాయుడు టిక్కెట్లు లేవ్‌

టాలీవుడ్‌లో గ‌త రెండు నెల‌లుగా పెద్ద సినిమాలు లేక జ‌నాలు స‌రైన సినిమా కోసం మొహం వాచిపోయి ఉన్నారు. మార్చిలో ఇప్ప‌టి వ‌ర‌కు ఓ మోస్త‌రు సినిమా కూడా లేదు. దీంతో పాత సినిమాల‌నే మ‌రోసారి థియేట‌ర్ల‌లో ఆడిస్తున్నారు. చాలా థియేట‌ర్లు జ‌నాల్లేక ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అటు థియేట‌ర్లు, ఇటు జ‌నాల నీరసానికి ఉత్తేజం ఇస్తూ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడిగా ఈ నెల 24 థియేట‌ర్ల‌లోకి దూసుకు వ‌స్తున్నాడు.

సినిమా కోసం ఆవురావుమంటోన్న జ‌నాలు కాట‌మ‌రాయుడు ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూద్దామ‌ని ఫిక్స్ అయిపోయిన‌ట్టున్నారు..అందుకే టిక్కెట్లు తెగ బుక్ చేసేసుకుంటున్నారు. సినిమాకు వెళ్తామో లేదో తర్వాత ముందైతే టికెట్ బుక్ చేసి పారేద్దాం అన్నట్లు బుక్ మై షో వెబ్ సైట్ మీద పడిపోతున్నారు. దీంతో కాట‌మ‌రాయుడు ప్ర‌ద‌ర్శించే థియేట‌ర్ల‌లో టిక్కెట్ల బుకింగ్ స్టార్ట్ చేయ‌డం ఆల‌స్యం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడ‌వుతున్నాయి.

బుకింగ్ ఓపెన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ ఔట్ అంటూ గ్రే సీట్లు దర్శనమిస్తుండటంతో జనాలకు నిరాశ తప్పట్లేదు. ఏపీ, తెలంగాణ‌లోని 90 – 95 శాతం థియేట‌ర్ల‌లో కాట‌మ‌రాయుడు రిలీజ్ అవుతోంది. హైద‌రాబాద్‌లో అయితే 95 శాతం మ‌ల్టీఫ్లెక్స్, సింగిల్ స్క్రీన్ల‌లో కాట‌మ‌రాయుడు వ‌స్తున్నాడు. సినిమా కోసం చాలా స్క్రీన్లు ఇచ్చినా ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో కాదు క‌దా…ఫ‌స్ట్ వీకెండ్‌కే టిక్కెట్లు లేని ప‌రిస్థితి.

నగర శివార్లలో కొన్ని చోట్ల మినహాయిస్తే టికెట్లు అందుబాటులో లేవు. వీకెండ్ మొత్తానికి బుకింగ్స్ పూర్తయిపోయాయి. దీంతో చాలా మంది షాక్ అవుతున్నారు. సినిమాపై బ‌జ్ అంతంత మాత్రంగానే ఉన్నా ప‌వ‌న్ క్రేజ్ ఎలా ఉందో ఈ బుకింగ్సే చెపుతున్నాయి.