పున‌ర్విభ‌జ‌నపై గంద‌ర‌గోళంలో టీడీపీ – బీజేపీ

పున‌ర్విభ‌జ‌న ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని ఆంధ్రా ప్రాంత ఎంపీలంతా త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఏపీకి రావాల్సిన వాటి విష‌యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావ‌డం మాటెలా ఉన్నా.. ఈ పున‌ర్విభ‌జ‌న గురించి కేంద్ర‌మంత్రి వెంక‌య్యనాయుడితో తెగ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ఆయన్ను క‌లిసిన ప్ర‌తిసారీ.. ఈ అంశం గురించి అడుగుతున్నార‌ట‌. టీడీపీ ఎంపీ, కేంద్ర‌మంత్రి సుజనా చౌద‌రి మ‌రో అడుగు ముందుకేసి.. మ‌రో నెలరోజుల్లోనే పున‌ర్విభ‌జ‌న ఉంటుంద‌ని ప్ర‌క‌టించేశారు. అయితే తెలుగు ఎంపీల దూకుడుకు ఏపీ బీజేపీ నేత హ‌రిబాబు బ్రేక్ వేశారు. పున‌ర్విభ‌జ‌నకు చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని తేల్చి చెప్పారు.

టీడీపీ ఎంపీల ఆతృత అంతా నియోజ‌క వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పైనే ఉంద‌ని మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. ఆ మ‌ధ్య కేంద్ర‌మంత్రి వెంక‌య్య తో స‌మావేశ‌మ‌య్యారు. ఆ సంద‌ర్భంలోనూ నియోజ‌క వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న త్వ‌ర‌గా చేప‌ట్టాల‌ని కోరిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్ర‌క్రియ‌పై వారు కొండంత ఆశ‌లు పెట్టుకున్న‌ట్టు స‌మాచారం! ఇప్ప‌టికే తెలుగుదేశంలో గ్రూపు రాజ‌కీయాలు పెరిగిపోయాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌మ ప్రాధాన్య‌త ఏమిటో ఎక్క‌డో అనేది చాలామంది ఫిరాయింపుదారుల‌కు అర్థం కావ‌డం లేదు. ఇంకోప‌క్క టీడీపీలో సీనియ‌ర్లు కూడా ఫిరాయింపుల వ‌ల్ల అసంతృప్తిలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు వీరంద‌రిలోనూ భ‌రోసా పెంచేలా పార్టీ తీవ్ర ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్న సంకేతాలు ఇస్తున్నారు కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి! మ‌రో నెల‌రోజుల్లోనే నియోజ‌క వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు! ఇదేమాట తెలుగుదేశం నేత‌ల‌తోనూ ఆయ‌న చెబుతున్నార‌ట‌. అయితే ఇంకోప‌క్క‌ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు హ‌రిబాబు అభిప్రాయం మ‌రోలా ఉంది. పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గాలంటే రాజ్యాంగ స‌వ‌ర‌ణ అవ‌స‌రం ఉంటుంద‌ని హ‌రిబాబు అంటున్నారు. ముందుగా రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాల‌ని అటార్నీ జ‌న‌ర‌ల్ అభిప్రాయ‌ప‌డ్డార‌ని ఆయ‌న చెప్పారు. ఈ ప్ర‌క్రియ‌కు చాలా స‌మ‌యం ప‌ట్టేలా ఉంద‌న్న‌ట్టు ఆయ‌న మాట్లాడుతున్నారు.

ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన మ‌రో విషయమేంటంటే… ప్ర‌స్తుతం పున‌ర్విభ‌జ‌న‌పై ప‌ట్టుబ‌డుతున్న‌ది కేవ‌లం తెలుగు రాష్ట్రాలు మాత్ర‌మే. అందులోనూ తెలుగుదేశం ఎంపీలు మాత్ర‌మే. హ‌రిబాబు వ్యాఖ్య‌ల‌తో  ఫిరాయింపు టీడీపీ నేత‌ల్లో కాస్తంత గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని స‌మాచారం. వ‌చ్చే నెల‌లో ప్ర‌క్రియ స్టార్ట్ అని సుజ‌నా అన‌డం, కాస్త టైం ప‌ట్టేలా ఉంద‌ని హ‌రిబాబు సంకేతాలివ్వ‌డం… రెండూ ఒకేసారి జ‌రిగేస‌రికి మ‌రోసారి క‌న్ఫ్యూజ‌న్ లో ప‌డుతున్నారు ఫిరాయింపు తెలుగు త‌మ్ముళ్లు! ఇప్ప‌ట్లో పునర్విభ‌జ‌న ఉంటుందా ఉండ‌దా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. మ‌రి ఇదంతా టీడీపీ, బీజేపీ మైండ్ గేమ్‌లా ఉంద‌నేది కొంద‌రి అభిప్రాయం!!