టీఆర్ఎస్‌-బీజేపీ మ్యాచ్ ఫిక్స్‌.. సాక్ష్యాలివిగో

టీఆర్ఎస్‌-బీజేపీ మ్యాచ్ ఎప్పుడు ఫిక్స్ అవుతుందో అని తెలంగాణ‌లో మెజారిటీ ప్ర‌జ‌లు వేచిచూస్తున్నారు. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. బీజేపీ అధిష్ఠానం తెలంగాణ‌పై దృష్టిసారిస్తుంద‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. మ‌జ్లిస్ త‌మ‌కు దూర‌మ‌వుతుందనే ఉద్దేశంతో టీఆర్ఎస్ కొంత వెనుకంజ వేస్తోంది, అయితే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్‌-బీజేపీ మ్యాచ్ ఫిక్స్ అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. స‌భ‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఇందుకు బ‌లం చేకూరుస్తున్నాయి. అటు మ‌జ్లిస్, ఇటు బీజేపీతో జ‌ట్టు క‌డితే ఇక త‌మ‌కు ఎదురు ఉండ‌ద‌ని భావించిన‌ సీఎం కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులేస్తున్నారు.

తెలంగాణ శాసనసభలో బీజేపీ- టీఆర్ఎస్‌ల మధ్య నడుస్తున్న ప్రహసనం చూస్తుంటే రెండు పార్టీల మ‌ధ్య‌ ఏదో జరుగుతోంద‌నేది స్పష్టమై పోతుంది.  రెండు రోజుల వ్యవధిలో టి అసెంబ్లీలో ఈ రెండు పార్టీల మధ్య పరస్పర క్షమాపణలు స్నేహాలాపనలు సస్పెన్షన్లు, బిల్లుల వాయిదాలు అన్ని కలిపి ఒక సీరీస్‌గా చూస్తే మ్యాచ్‌ పిక్సింగ్ అనుమానాల‌కు తావిస్తోంది. సంఖ్య రీత్యా ఎక్కువ మంది ఉన్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కన్నా బీజేపీనే టీఆర్ఎస్‌ను నిల‌దీయడం..దానికి టిఆర్‌ఎస్‌ కూడా విపరీతంగా స్పందించడం వీటికి బ‌లం చేకూరుస్తోంది.

విద్యుత్‌ శాఖపద్దుపై చర్చ సందర్భంగా శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి కేంద్ర విద్యుత్‌ సంస్థలు మార్వాడీల కన్నా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు.దీనిపై బీజేపీ స‌భ్యులు పోడియం దగ్గరకు వెళ్లి నిరసన తెల్పగా ఆయన వ్యాఖ్య ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పారు. ఇక బీజేపీ శాసనసభాప‌క్ష‌ నేత కిషన్‌రెడ్డి తాము పోడియం దగ్గరకు వెళ్లడం తప్పేనని క్షమాపణ చెప్పారు. ఇలా చేసిన వారిని వెంటనే బయిటకు పంపాలంటూ రూపొందించిన రూల్‌ ఇతర పార్టీలకు వర్తింపచేసినట్టు బీజేపీకి చేసి వారిని బయిటకు పంపించలేదు. తర్వాత ముస్లిం రిజర్వేషన్ల బిల్లుపై సభ వెలుపల ఆందోళన చేపట్టిన బీజేపీ నేత‌లు సభలోనూ రభస చేశారు.

వారిని రెండు రోజులు మాత్రం సస్పెండ్‌ చేస్తూ సభాపతి ప్రకటించారు. మరో వైపు సీఎం కేసీఆర్ మరో వారంలో బీసీ కమిషన్‌ నివేదిక వచ్చాక ఈ బిల్లు ప్రవేశపెడతామని వెనక్కు తగ్గారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టిఆర్‌ఎస్‌తో నేరుగా కలవడానికి వీలుకాకున్నా సహాయం తీసుకోవాలని బీజేపీ భావిస్తోంద‌ట‌. మజ్లిస్‌తోస్నేహాన్ని కొనసాగిస్తూనే బిజెపిని కూడా సంతోషపెడితే తమకు ఢోకా వుండదని కెసిఆర్‌ అనుకుంటున్నారట. మ‌రి ఎన్నాళ్లు ఈ ముసుగులో గుద్దులాట‌లో వేచిచూడాల్సిందే!!