చంద్ర‌బాబు ఈ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డ‌తారో లేదో వేచిచూడాల్సిందే!!

`త‌ప్పు చేస్తే ఎంత‌టివారినైనా వ‌ద‌ల‌ను. వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి వెనుకాడే ప్ర‌స‌క్తే లేదు` అని నిత్యం గంభీర స్వ‌రంతో, సీరియ‌స్‌గా లెక్చ‌ర్లు ఇస్తుంటారు సీఎం చంద్ర‌బాబు!! మ‌రి సొంత పార్టీ నేత‌లే ఇప్పుడు ర‌చ్చ‌రచ్చ చేస్తున్నా వారిని కేవ‌లం మంద‌లించి వ‌దిలేయ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మీడియా ముందు తామేమీ చేయ‌లేద‌ని చెప్పిన నేత‌లు, చంద్ర‌బాబును క‌లిసిన త‌ర్వాత విచారం వ్య‌క్తంచేస్తూ సారీ చెప్ప‌డం వెనుక గ‌ల ఉద్దేశ‌మేమిటని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

తమ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని విశ్లేష‌కులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో అధికారులపై నేత‌లు రెచ్చిపోవటం.. వారిపై భౌతికదాడులు చేసేందుకు సైతం వెనుకాడని తత్వ్తం పెరగుతోంది. ఆ మధ్య ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారితే..తాజాగా రవాణా శాఖ కమిషనర్ బలసుబ్రమణ్యం పట్ల టీడీపీ ఎంపీ.. ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించిన వైనంపై బాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ0 వ్యవహారంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఇందుకు కారణమైన నేతల్ని తన వద్దకు పిలిపించుకొని తలంటు పోసి క్ష‌మాపణలు చెప్పాలంటూ ఆదేశం జారీ చేశారు,

ఈ మొత్తం ఎపిసోడ్ ను చూస్తే.. మొదట తమ తప్పు ఏమీ లేదని వాదించిన నేతలు..ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని.. ఆక్షింతలు వేసిన తర్వాత ఓకే అంటున్న వైనం చూస్తే.. అధికార పార్టీ నేతలు ఇంత బాధ్యతా రాహిత్యంతో ఎందుకు ప్రవర్తిస్తున్నరన్నది పెద్ద ప్రశ్న. ప్రతీ అంశంలోనూ సీఎం జోక్యం చేసుకుంటారని చెప్పలేం. మీడియాలో ప్రముఖంగా వచ్చి..రచ్చ అయ్యాక మాత్రమే చంద్రబాబు రెస్పాండ్ అవుతున్నారే తప్పించి.. విషయం జరిగిన వెంటనే ఆయనేమీ స్పందించటం లేదని చెప్పక తప్పదు.

ప్రజలు ఏమనుకుంటారో?ప్రభుత్వం మీద ఉన్న ఇమేజ్ దెబ్బ తింటుందన్న అంశం మీదనే దృష్టి తప్పించి.. అధికారులపై అధికార పక్షం చేస్తున్న దాడులకు చెక్ పెట్టేలా కఠిన నిర్ణయాలు ఏం తీసుకోలేదని చెప్పక తప్పదనేది కొంద‌రి అభిప్రాయం! మ‌రి ఈ దిశ‌గా చంద్ర‌బాబు చ‌ర్య‌లు చేప‌డ‌తారో లేదో వేచిచూడాల్సిందే!!