టీఆర్ఎస్ – టీడీపీ పొత్తు…తెరవెనక ఏం జరిగింది..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో చాలా మందికి టీడీపీనే రాజ‌కీయంగా లైఫ్ ఇచ్చింది. ఆ మాట‌కు వ‌స్తే సీఎం కేసీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానం సైతం టీడీపీతోనే స్టార్ట్ అయ్యింది. త‌ర్వాత కేసీఆర్ ప్ర‌త్యేక తెలంగాణ కోసం టీఆర్ఎస్‌ను స్థాపించి తెలంగాణ సాధించారు. ప్ర‌స్తుతం తెలంగాణ తొలి సీఎంగా కూడా కేసీఆర్ రికార్డుల‌కు ఎక్కారు.

ఇదిలా ఉంటే రాష్ట్రం విడిపోయాక తెలంగాణ‌లో తెలుగుదేశం రోజు రోజుకు అవ‌సాన ద‌శ‌కు చేరుకుంటోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో ప్ర‌స్తుతం ఆ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్నారు. విడ‌త‌ల వారీగా 12 మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇలా జంప్ చేసిన వారిలో త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌కు మంత్రి ప‌ద‌వి కూడా వ‌చ్చింది.

ఇదిలా ఉంటే గ‌తంలోనే కేసీఆర్ టీడీపీతో పొత్తుకు ట్రై చేశార‌ట‌. సింపుల్ మెజార్టీతో ఉన్న త‌మ ప్ర‌భుత్వాన్ని మ‌రింత స్ట్రాంగ్ చేసుకునేందుకు ఆయ‌న టీడీపీని త‌మకు స‌పోర్ట్ చేయాల‌ని కోరార‌ట‌. ఇందుకు చంద్ర‌బాబుతో చ‌ర్చ‌లు జ‌రిపిన కేసీఆర్ టీడీపీ త‌మ ప్ర‌భుత్వంలో చేరితే రెండు మంత్రి ప‌ద‌వుల‌తో పాటు రెండు కార్పొరేష‌న్ ప‌ద‌వులు ఇస్తామ‌న్నార‌ట‌. ఈ విష‌యాన్ని టీ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

కేసీఆర్ ప్ర‌తిపాద‌న‌కు చంద్ర‌బాబు ఒప్పుకోక‌పోవ‌డంతో కేసీఆర్ మ‌రో రూట్లో బెదిరింపులు, ఇత‌ర మార్గాల ద్వారా కాంగ్రెస్‌, టీడీపీ, ఇత‌ర పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేల‌ను లోబరుచుకున్నారని రేవంత్ తెలిపారు. ఇక తెలంగాణ‌లో టీడీపీ ఎప్ప‌ట‌కీ టీఆర్ఎస్‌తో క‌ల‌వ‌ద‌ని చెప్పేందుకే తాను ఈ విష‌యాన్ని చెపుతున్న‌ట్టు రేవంత్ చెప్పారు. మ‌రి నిజంగానే టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరితే ఇప్పుడు ద‌క్కిన‌ప‌ద‌వులు క‌న్నా ఇంకా మంచి ప‌ద‌వులే వ‌చ్చ‌వేమో అన్న చ‌ర్చ‌లు టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.