కుడి, ఎడ‌మైన నారాయ‌ణ‌, గంటా ప్లేస్‌లు

ఏపీలో చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు, నారాయ‌ణ ఇద్ద‌రూ స్వ‌యాన వియ్యంకులే. గ‌త ఎన్నిక‌ల్లో గంటా పార్టీ మారి భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం గంటాకు మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది. నారాయ‌ణ‌కు మాత్రం చాలా ల‌క్‌గా కేబినెట్‌లో బెర్త్ ద‌క్కింది. ఆయ‌న‌కు అప్ప‌టి వ‌ర‌కు ఎన్నికలంటే ఏంటో కూడా తెలియ‌దు. విద్యాసంస్థ‌ల అధినేత‌గా ఉన్న నారాయ‌ణ ఒక్క‌సారిగా మంత్రి అయిపోయారు.

నారాయ‌ణ మంత్రి అవ్వడం ఆల‌స్యం…చంద్ర‌బాబుకు రైట్ హ్యాండ్ అయిపోయారు. కీల‌క‌మైన సీఆర్‌డీఏ వ్య‌వ‌హారాల్లోను, రాజ‌ధానికి అవ‌స‌ర‌మైన భూమిని రైతుల నుంచి సేక‌రించే విష‌యంలో నారాయ‌ణ పోషించిన పాత్ర‌కు చంద్ర‌బాబు వ‌ద్ద ఆయ‌న‌కు తిరుగులేని మార్కులు ప‌డ్డాయి. ఒకానొక‌టైంలో నారాయ‌ణ ఏం చెపితే చంద్ర‌బాబు అన్నంత‌గా ఆయ‌న హ‌వా కొన‌సాగింది.

అదే టైంలో మంత్రి గంటాకు చంద్ర‌బాబు ప‌దే ప‌దే చీవాట్లు పెట్టారు. జిల్లాలో మ‌రో మంత్రి అయ్య‌న్న‌తో ఉన్న విబేధాలు, గ్రూపు రాజ‌కీయాలు, శాఖా ప‌రంగా స‌రైన ప‌నితీరు లేక‌పోవ‌డంతో గంటాను చంద్ర‌బాబు చాలాసార్లు తిట్టిన‌ట్టు మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. బాబు దృష్టిలో గంటాకు మంచి ర్యాంకు కూడా ఎప్పుడూ లేదు.

అయితే తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఇప్పుడు చంద్ర‌బాబు వ‌ద్ద గంటా ప్రాధ‌న్యాన్ని ఒక్క‌సారిగా పెంచేయ‌గా, నారాయ‌ణ మంత్రి ప‌ద‌వికే ఎర్త్ పెట్టేలా మారాయి. గంటా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న క‌డ‌ప‌లో టీడీపీ ఏకంగా వైఎస్‌.వివేకానంద‌రెడ్డిని ఓడించి చ‌రిత్ర క్రియేట్ చేసింది.

ఇక నారాయ‌ణ ప‌ట్టుబ‌ట్టి టిక్కెట్టు ఇప్పించుకున్న వేమిరెడ్డి ప‌ట్టాభి రామిరెడ్డి ఎమ్మెల్సీగా ఓడిపోయారు. దీంతో చంద్ర‌బాబు ఇప్పుడు గంటాను ఆకాశానికి ఎత్తేస్తుండ‌గా, నారాయ‌ణ‌ను కేబినెట్ నుంచి త‌ప్పించే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడు చంద్ర‌బాబు వ‌ద్ద ఈ వియ్యంకులైన మంత్రుల పొజిష‌న్లు కుడిఎడ‌మైన‌ట్టు టాక్‌?