ఇక మోడీకీ బాబు స‌రెండ‌ర్ కావాల్సిందేనా?  

ప్ర‌ధాని మోడీ.. సూప‌ర్ హీరో అయిపోయారు! ఉత్తర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ప్ర‌భంజ‌నం సృష్టించి తిరుగులేని నేత‌గా అవ‌తరించారు. అంత‌కంత‌కూ త‌న బ‌లాన్ని కూడ‌గ‌ట్టుకుని శ‌క్తిగా మారుతున్నారు. మెడీ బ‌ల‌ప‌డ‌టం తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కూ మింగుడు ప‌డ‌ని అంశ‌మే! పైకి అభినంద‌న‌లు చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం టెన్ష‌న్ మాత్రం పెరుగుతోంద‌ట‌. ముఖ్యంగా మోడీ వ్య‌వ‌హార శైలి నాయ‌కులంద‌రికంటే చాలా భిన్నం! ఎప్పుడూ డిమాండ్ చేస్తే అస్స‌లు ప‌నులు జ‌ర‌గ‌వు! ఓన్లీ రిక్వెస్ట్‌లే!! అందుకే ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక లెక్క‌.. ఈ విజ‌యం త‌ర్వాత ఇంకో లెక్క అన్న రేంజ్లో ఇప్పుడు కేంద్రంతో వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే.. ఇక ఆట‌లు సాగ‌న‌ట్టే!!

ప్రధాని నరేంద్రమోడీకి పెద్ద రిలీఫ్. ఒక్క ఉత్తరప్రదేశ్ ఫలితాలు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపబోతున్నాయి. ఈ ఫలితాలతో రాజ్యసభలో బీజేపీకి తిరుగులేని మెజారిటీ ద‌క్క‌బోతోంది. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నిక కూడా బీజేపీ కోరుకున్న వ్యక్తిని సులభంగా నెగ్గించుకునే ఛాన్స్ దక్కబోతోంది. రాజ్యసభలో మెజారిటీ వస్తే…బిల్లుల ఆమోదం కోసం ఇతర పార్టీలపై ఆధారపడాల్సి రావటం తగ్గుతుంది. సో..మంచి అయినా చెడు అయినా మోడీ కోరుకున్న విధంగా ముందుకు వెళ్లే ఛాన్స్ దొరుకుతుంది. లోక్ సభలో పూర్తి మెజారిటీతోనే మోడీ ఏకపక్షంగా..కేంద్రంలోని మంత్రులను కూడా పెద్దగా కేర్ చేయకుండా ముందుకెళుతున్నారని ప్రచారం ఉంది.

ఒకప్పుడు కేంద్రం బలహీనంగా..రాష్ట్రాలు బలంగా ఉండేవి. ముఖ్యంగా విభజన తర్వాత భారీగా నష్టపోయిన ఏపీకి భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కూడా కేంద్రాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితిలో చంద్రబాబు లేరు. అందుకే న్యాయబద్దమైన డిమాండ్ ను కూడా ఆయన వదిలేసి…కేంద్రం ఏది చెపితే అదే కరెక్ట్ అనే పరిస్థితికి వచ్చారు. ఓ వైపు వివాదస్పద స్విస్ ఛాలెంజ్ విధానం, మరో వైపు సాగునీటి ప్రాజెక్టుల్లో చోటుచేసుకుంటున్న భారీ కుంభకోణాలు, మరో వైపు ఓటుకు నోటు కేసు ఇలాంటి అంశాలన్నింటి కారణంగా చంద్రబాబు తొలిసారి కేంద్రం ముందు ‘సరెండర్’ కావాల్సి వచ్చింది.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో బిజెపి ఘనవిజయం సాధించటంతో మోడీ మరింత శక్తివంతం అయ్యారు. ప్రధాని మోడీ మరింత బలోపేతం అవటం వల్ల ఒక్క చంద్రబాబునాయుడికే కాకుండా తెలంగాణ సీఎం కెసీఆర్ తోపాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్రం చెప్పినట్లు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఏ రాష్ట్రం అయినా సరే అయినా కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసుకోవాల్సిందే తప్ప..డిమాండ్ చేసే పరిస్థితి ఉండదనేది వాస్తవం.