సోష‌ల్ మీడియాలో హోదాపై నెగెటివ్ ప్ర‌చారం

ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించేవ‌ర‌కూ పోరాడేందుకు యువ‌త సిద్ధ‌మ‌వుతోంది, త‌మ ఉజ్వ‌ల‌ భ‌విష్య‌త్తు కోసం ఉద్య‌మించేందుకు స‌మ‌ర శంఖం పూరిస్తోంది. న‌మ్మించి వంచించిన ప్ర‌భుత్వం, నేత‌లు యువ‌త ఉద్య‌మానికి బాస‌టగా నిల‌వ‌లేక పోతున్నారు. ప్ర‌స్తుతం హోదాకు సంబంధించి సోష‌ల్ మీడియాలో ప్రచారం ఉధృతంగా జ‌రుగుతోంది. ముఖ్యంగా హోదాకు మ‌ద్ద‌తుగా చేస్తున్న ప్ర‌చారానికి నెగెటివ్ ప్ర‌చారం మొద‌లైంది. హోదా వ‌ల్ల రాష్ట్రానికి వ‌చ్చే ప్ర‌యోజ‌న‌మేదీ లేద‌నే ప్ర‌చారం ఇప్పుడు జోరుగా జరుగుతోంది.

తమిళ యువత జల్లికట్టు కోసం చేసిన పోరాటం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ యువత ప్రత్యేకహోదా ఉద్యమానికి సిద్ధం అవుతోంది. ఈ ఉద్యమానికి మద్దతుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అధికారపార్టీలోని కొన్ని వ‌ర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి, తమ భవిష్యత్తు కోసం యువత ఉద్యమానికి సిద్ధం అవుతుంటే, దానిని నీరుగార్చేలా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైన్యం ప్రచారం మొదలుపెట్టింది. యువతలో నిరాశను నింపే కుట్ర చేస్తోంది.

జ‌ల్లిక‌ట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువ‌త పోరాడుతుంటే.. జ‌ల్లిక‌ట్టుకు, హోదాకు సంబంధం లేద‌నేది మ‌రో వ‌ర్గం వాద‌న‌. హోదాతో ఉద్యోగాలు, ప‌రిశ్ర‌మ‌లు, వాటికి రాయితీలు వ‌స్తాయ‌ని ఇది విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఆంధ్ర‌కు చేయూత ఇవ్వ‌డ‌మేన‌ని నాడు రాజ్య‌స‌భ‌లో ఇప్ప‌టి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంక‌య్య తెగ పోరాడారు. ఇప్పుడు దీని పైనే యువ‌త పోరాడుతోంది, అయితే హోదా ఉన్న రాష్ట్రాలేవీ ఎదగలేదని, హోదావల్ల లాభం లేదని, హోదా ఉన్న రాష్ట్రాలేవీ అభివృద్ధి చెంద‌లేద‌ని ప్రచారం చేస్తున్నారు.

ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తే పెట్టుబడులకి అనుకూల వాతావరణం చెడిపోతుందంటున్నారు. అయితే హోదా వ‌స్తే ప‌రిశ్ర‌మ‌లే రాష్ట్రానికి క్యూ క‌డ‌తాయి క‌దా! అలాగే ఆర్ కే బీచ్‌లో యువ‌త ఉద్య‌మానికి అనుమ‌తిస్తే తుని త‌ర‌హా ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయ‌ని, పెట్టుబ‌డులు పెట్టే కంపెనీలు వెన‌క్కి వెళిపోతాయ‌నే ప్ర‌చారం కూడా జోరందుకుంది. యువ‌త అంతా ఒక్క‌తాటిపైకి వ‌చ్చి హోదా కోసం ఉద్య‌మిస్తున్న వేళ‌.. ఇటువంటి నెగెటివ్ ప్ర‌చారం వారి స్ఫూర్తిని దెబ్బతీస్తుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌!! రాష్ట్ర భవిష్యత్తుకోసం చేపడుతున్న ఉద్యమాన్ని అల్లర్లు జరుగుతాయనే సాకుతో అడ్డుకోవాలని చూడడం ఏపీకి ద్రోహం చేసినట్లే..