ఎట్‌హోంలో చంద్రుల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

గ‌వ‌ర్న‌ర్ స‌మ‌క్షంలో మ‌రోసారి ఇద్ద‌రు చంద్రులు క‌లుసుకున్నారు. చిరున‌వ్వులు చిందిస్తూ మాట్లాడుకున్నారు. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుందామని సానుకూలంగా చ‌ర్చించుకున్నారు!! మ‌రోసారి వీరి క‌ల‌యిక‌కు వేదిక‌గా మారింది ఎట్ హోం కార్య‌క్ర‌మం! ఈ స‌మావేశంలో పాల్గొన్న ఇద్ద‌రు సీఎంలు.. ఎంతో కాలంగా అప‌రిష్కృతంగా ఉన్న హైకోర్టు విభ‌జ‌న‌పై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు సమాచారం!

రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఎప్పుడు క‌లుసుకున్నా.. వారేం మాట్లాడుకున్నార‌నే అంశంపైనే తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతుంది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ క‌లయిక ఆస‌క్తిక‌రంగా మారింది. ఎట్‌ హోం కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల‌ సీఎంలు గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ఈ సమావేశం కోసమే చంద్రబాబు ప్రత్యేకంగా హైదరాబాద్‌ వచ్చారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఒకసారి సమావేశం ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ కోరడంతో గవర్నర్‌.. చొరవ తీసుకొన్నారు.

ఉమ్మడి హైకోర్టు విభజనకు సహకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కోరగా, అప్పుడొకటి, ఇప్పుడొకటి కాకుండా, అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించుకొందామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైకోర్టు ఇంకా ఉమ్మడిగానే ఉండటం.. పరిపాలనాపరమైన సమస్యలకు కారణం అవుతున్నదని చంద్రబాబుకు కేసీఆర్‌ వివరించారు. `అన్నీ అపరిష్కృతంగా ఉంచుకొనే కంటే ఒక్కో అంశాన్ని పరిష్కరించుకొంటూ వెళ్లడం మంచిది. హైకోర్టు విభజన కోసం తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో అడుగుతోంది. అందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలపా`లని గ‌వ‌ర్న‌ర్‌ సూచించారు.

విభజనలో తలెత్తిన సమస్యలు తమను ఎక్కువగా బాధిస్తున్నాయని, అవి త్వరగా పరిష్కారం కావాలని అందరికంటే తామే ఎక్కువగా కోరుకొంటున్నామని చంద్రబాబు.. కేసీఆర్‌, నరసింహన్‌తో అన్నారు. ‘అప్పుడు ఒకటి…అప్పుడు ఒకటి కాదు. పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలను ఒకేసారి పరిష్కరించుకొందాం. సమస్యలన్నీ ఒకసారి పరిష్కారమైతే ఎవరికీ మనస్తాపం ఉండదు’’ అని బాబు పేర్కొన్నారు. పదోషెడ్యూల్‌ సంస్థల విభజనపై మాటేమిటని, సుప్రీం చెప్పినా విభజన జీవో ఏదని చంద్రబాబు అడిగారు. సమస్యలపై ప్రభుత్వాలు పట్టువిడుపులతో వ్యవహరించాలని గవర్నర్‌ విజ్ఞప్తి చేశారు.