లోకేశ్‌ కోసం బాబుకు ఎన్ని క‌ష్టాలో..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌ర్వాత టీడీపీ బాధ్య‌త‌లు మోయాల్సిన నాయ‌కుడు లోకేష్‌! టీడీపీ ప‌గ్గాలు చేపట్టాల్సిన నేత! లోకేష్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని టీడీపీ నేత‌లంతా కోరుకుంటున్నారు. అయితే అంద‌రూ ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నా.. బాబు మాత్రం కీల‌క ప‌ద‌వి ఇచ్చేందుకు వెనుకాడుతూనే ఉన్నారు. పార్టీపై ప‌ట్టు సాధించ‌లేకపోవ‌డం, చురుకుగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోవడం.. ఇంకా తండ్రిచాటు బిడ్డ‌గానే ఉండ‌టం.. వంటి కారణాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు అడ్డంకులు వేస్తూ వ‌స్తున్నారు. అయితే ఇప్పుడు మంత్రి ప‌ద‌వి ఇచ్చి ఎమ్మెల్సీ చేసేందుకు చంద్ర‌బాబు ఎట్ట‌కేల‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వార‌స‌త్వ రాజ‌కీయాలు జోరందుకుంటున్నాయి. ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు త‌మ కొడుకుల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు సిద్ధ‌మైపోయారు. ఒక‌ప‌క్క తెలంగాణ‌లో కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ రాకెట్ వేగంతో దూసుకుపోతుంటే.. ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్‌ మాత్రం ఇంకా ప‌రిప‌క్వ‌త సాధించ‌లేక‌పోతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అందుకే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి తీసుకురావ‌డం లేద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం! అయితే త్వ‌ర‌లో ఆయ‌న‌కు ఎమ్మెల్సీ క‌ట్ట‌బెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఇప్పటికే పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్నలోకేశ్‌ త్వరలో ప్ర‌జా ప్రతినిధి కానున్నారట . ఈ వేసవిలో జరిగే మండలి ఎన్నికల్లో అయన పోటీలో ఉంటారని స‌మాచారం. ఆంధ్రప్రదేశ్ లో త్వ‌ర‌లో ఎమ్మెల్సీ స్థానాల‌కు త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఇందులో టీడీపీకి ఆరు, వైసీపీకి ఒకటి ద‌క్కే అవ‌కాశాలున్నాయి. అయితే చిన్నబాబు ను ఈ కోటా నుంచే ఎన్నుకుంటారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముందుగా ఎమ్మెల్యేగా పోటీచేయించాల‌ని చూసినా.. ముందుగా మండ‌లికి పంపి.. తర్వాత ఎమ్మెల్యేగా పోటీచేయించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించార‌ట‌.

మండ‌లికి పంపితే క్షేత్ర స్థాయి స‌మ‌స్య‌ల‌పై కొంత అవగాహ‌న వ‌స్తుంద‌ని, రాజ‌కీయాల్లో మ‌రింత రాటు తేలే అవ‌కాశ‌ముంద‌నేది బాబు యోచ‌న‌. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో లోకేశ్‌కు చోటు కల్పించబోతున్నారని కూడా స‌మాచారం. మంత్రివర్గంలోకి చేరడానికి ముందో.. చేరిన ఆరు నెలలలోపో ఏదో ఒక చట్టసభలో సభ్యుడు కావలసి ఉంటుంది కాబట్టి . విస్తరణకు ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయట‌. మ‌రి కొడుకు కోసం బాబు ప‌డుతున్న క‌ష్టాలు ఫ‌లిస్తాయో లేదో వేచి చూడాలి!!