ములాయం – అఖిలేష్ మ‌ధ్య వియ్యంకుడి రాజీ

ఎన్నిక‌లు ముంచుకొచ్చిన వేళ‌.. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని అధికార పార్టీ ఎస్పీలో నెల‌కొన్న ముస‌లానికి పార్టీ చీఫ్ ములాయం సింగ్ ఉర‌ఫ్ నేతాజీ ముగింపు ప‌ల‌కాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలిసింది. త‌న పెద్ద కొడుకు.. యూపీ సీఎం అఖిలేష్‌ను మొండివాడిగా పేర్కొంటూ.. తాను ఓ ప‌రిష్కారానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి గ‌డిచిన ఆరు నెలలుగా ఎస్పీ అధికార పార్టీలో పెద్ద ఎత్తున ఆధిప‌త్య పోరు పెరిగింది. మంత్రిగా ఉన్న సొంత బాబాయి శివ‌పాల్ యాద‌వ్‌ను తొల‌గిస్తూ.. అఖిలేష్‌ తీసుకున్న‌ నిర్ణ‌యం పెద్ద దుమారం సృష్టించింది. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌లు ప‌రిణామాల నేప‌థ్యంలో ఇటీవ‌ల పార్టీ నుంచి అఖిలేష్‌ను స‌స్పెండ్ చేస్తూ.. ములాయం నిర్ణ‌యం తీసుకున్నారు.

అయితే, ఎన్నిక‌ల‌కు ముందు ప‌రిస్థితి ఇలా ఉంటే.. బీజేపీ.. బీఎస్పీల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టేన‌ని ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు హెచ్చ‌రించ‌డంతో స్వ‌యంగా రంగంలోకి దిగిన ములాయం కొడుకు అఖిలేష్‌ను దువ్వేందుకు రెడీ అయ్యార‌ని, ఈ క్ర‌మంలో ఆయ‌న కు వియ్యంకుడు వ‌రుస అయ్యే బిహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ రంగంలోకి దిగి.. ఇటు అఖిలేష్‌కి, అటు ములాయంకి కూడా న‌చ్చ‌జెప్పి ఓ దారిలోకి తెచ్చార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే నేతాజా ఒకింత ప‌రిస్థితుల‌కు అనుగుణంగా త‌న ఆలోచ‌న‌ను మార్చుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

తాజా వివాదంలో ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తున్న ములాయం చిన్న కోడ‌లికి అసెంబ్లీ కంటోన్మెంట్ టికెట్ నిరాక‌రించాల‌న్న అఖిలేష్ డిమాండ్‌ను నేతాజీ అంగీక‌రించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మ రోప‌క్క‌, పార్టీ గుర్తు సైకిల్‌పై ఈసీ ద‌గ్గ‌ర పోరాటానికి సిద్ధ‌మైన తండ్రీ కొడుకు.. ఎన్నిక‌ల ముంగిట ఇలా గుర్తు కోసం గొడ‌వ ప‌డితే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని గ్ర‌హించి పంథా మార్చుకుని మళ్లీ గ‌ప్‌చుప్ అయిపోయార‌ని తెలుస్తోంది. దీంతో యూపీలో అధికార పార్టీ వివాదాలు దాదాపుగా స‌మ‌సిపోయిన‌ట్టేన‌ని టాక్ వినిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.