ప‌వ‌న్ దెబ్బ‌కు కేంద్రం కూడా దిగివ‌చ్చింది

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌వ‌ర్ ఏంటో రాజ‌కీయ పార్టీల‌కు ఇప్పుడిప్పుడే తెలిసి వ‌స్తోంది. వెండితెర మీద ప‌వ‌న్ తిరుగులేని రారాజు అయినా పాలిటిక్స్‌లో మాత్రం ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. ప్ర‌త్యేక హోదా కోసం స‌మావేశాలు పెట్టి జ‌నాల్లోకి చొచ్చుకుపోతోన్న ప‌వ‌న్ తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఆ జిల్లాలో ప‌ర్య‌టించి వారితో స‌మావేశ‌మ‌య్యాడు.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ బాధితుల‌కు ఏం చేస్తుందో చెప్పాలంటూ 48 గంట‌ల పాటు అల్టిమేటం జారీ చేశారు. వెంట‌నే స్పందించిన ప్ర‌భుత్వం కిడ్నీ బాధితుల‌కు తాత్కాలిక ఉప‌శ‌మ‌నంగా కొన్ని రాయితీలు ప్ర‌క‌టించింది. ప‌వ‌న్ ఎప్పుడైతే అక్క‌డ ప‌ర్య‌టించాడో సీన్ మారింది. చంద్ర‌బాబు రంగంలోకి దిగి పించన్లు – బస్ పాసులు పంపిణీ చేస్తామని ప్రకటించారు.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు జ‌న‌సేనాని దెబ్బ‌కు కేంద్రం సైతం కాస్త దిగివ‌చ్చింది. ఉద్దానం ఏరియాలో కిడ్నీ బాధితులు ఎక్కువుగా ఉన్నార‌ని…ఇందుకు గ‌ల కార‌ణాలు ప‌రిశీలించాల‌ని కేంద్రం నుంచి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ ద్వారా ఇక్క‌డ‌కు స్పెష‌ల్‌గా ఓ రీసెర్చ్ బృందాన్ని పంపుతున్న‌ట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రకటించారు.

విశాఖ‌లో సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ సెంట‌ర్‌ను ఏపీకే చెందిన మ‌రో కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడుతో క‌లిసి న‌డ్డా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ప్ర‌సంగంలో ఉద్దానంలో కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌కు ఇప్పటివరకు కారణం-పరిష్కారం దొరకననందున త్వరలోనే తమ సారథ్యంలోని ప్రత్యేక బృందాన్ని పంపించనున్నట్లు నడ్డా ప్రకటించారు.

ప్రధానమంత్రి డయాలసిస్ యోజనను పీపీపీ మోడల్ లో ఏర్పాటు చేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఏదేమైనా ప‌వ‌న్ దెబ్బ‌కు ఇటే స్టేట్‌, అటు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్లు కాస్త దిగివ‌చ్చిన‌ట్టే క‌న‌ప‌డుతున్నాయి. మ‌రి ఫ్యూచ‌ర్‌లో చాలా ప్రాంతాల్లో ఉన్న ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై సైతం ప‌వ‌న్ ఇలాగే అల్టిమేటం జారీ చేస్తే జ‌న‌సేన రాజకీయంగా మ‌రింత పుంజుకుంటుంద‌న‌డంలో డౌటే లేదు.