ముద్ర‌గ‌డ దూకుడుకు బ్రేకులు

కాపు ఉద్య‌మ నేత‌, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం దూకుడుకి సీఎం చంద్ర‌బాబు త‌న‌దైన స్టైల్‌లో బ్రేకులు వేస్తున్నారు. అడుగ‌డుగునా ముద్ర‌గ‌డ‌కు చెక్ పెట్టేందుకు ఉన్న అన్ని వ్యూహాల‌ను అనుస‌రిస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావ్ స‌హా కొంద‌రు సీనియ‌ర్ల‌తో విమ‌ర్శ‌లు గుప్పించిన చంద్ర‌బాబు తాజా గా ఈ డ్యూటీని మంత్రుల‌కే అప్ప‌గించార‌ని అనిపిస్తోంది. మూకుమ్మ‌డిగా రాష్ట్ర మంత్రులు ముద్ర‌గ‌డ‌పై విరుచుకుప‌డ‌డం దీనికి బ‌లం చేకూరుస్తోంది. వాస్త‌వానికి మంత్రుల స్థాయిలో ముద్ర‌గ‌డ‌పై ఆరోప‌ణ‌లు చేయించాల్సిన ప‌నిలేదు. కానీ, బాబు వ్యూహంలో భాగంగానే మంత్రులు తెర‌మీద‌కి వ‌చ్చార‌ని తెలుస్తోంది.

నాలుగు రోజు ల కింద‌ట ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం .. చంద్ర‌బాబును ఉద్దేశించి మ‌రో లేఖ రాశారు. కాపుల‌ను ఓడించాల‌ని బాబు భావిస్తే.. రాబోయే రోజుల్లో బాబే ఓడిపోతార‌ని శాప‌నార్థాలు పెట్టారు. 2014లో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ఇస్తామ‌ని చెప్పి వారి ఓట్ల‌ను కొల్ల‌గొట్టిన బాబు.. ఇప్పుడు రిజ‌ర్వేష‌న్ గురించి మాట్లాడితే.. పోలీసుల‌తో అణిచి వేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. ఈ లేఖ విష‌యంలో చంద్ర‌బాబు సీరియ‌స్‌గానే స్పందించిన‌ట్టు తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి. ముద్ర‌గ‌డ లేఖ‌కు ప్ర‌తిగా.. మంత్రులు రంగంలోకి దిగి ముద్ర‌గ‌డ‌కు వారు కూడా లేఖాస్త్రం సంధించారు.

ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సహా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన‌ మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు, కిమిడి మృణాళినిలు ముద్రగడకు లేఖ రాశారు. ముద్రగడ తల్లీ – పిల్ల కాంగ్రెస్ లతో భేటీలు జరుపుతూ కాపు సోదరులకు కీడు చేస్తున్నారని ఆరోపించారు. ముద్రగడ తీరును యావత్ కాపులోకం అసహ్యించుకుంటోందన్నారు. జగన్ చేతిలో ముద్రగడ శిఖండిగా మారారనే భావన కాపుల్లో వ్యక్తమవుతోందని లేఖలో తెలిపారు. కాపులకు న్యాయం చేస్తున్న టీడీపీని విమర్శించ‌డం సరికాదన్నారు.

కాపులకు నిజంగా న్యాయం చేయగలిగేది ముద్రగడ ప‌ద్మ‌నాభ‌మా? లేక సీఎం చంద్రబాబా? అనేది కాపు సోద‌రుల‌కు తెలుసున‌ని మంత్రులు విరుచుకుప‌డ్డారు. మొత్తానికి చంద్ర‌బాబు ముద్ర‌గ‌డ‌కు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల దృష్ట్యా కాపు ఓటు బ్యాంకును కాపాడుకునే క్ర‌మంలో ముద్ర‌గ‌డ‌పై టీడీపీలోని కాపు ప్ర‌జా ప్ర‌తినిధులు, మంత్రులు, నాయ‌కుల‌తో దాడి కంటిన్యూ చేయిస్తార‌న్న టాక్ కూడా వ‌స్తోంది.