ప‌రిటాల అనుచ‌రుడికి షాక్ త‌ప్ప‌దా..!

అనంత‌పురం టీడీపీలో ఆధిప‌త్య రాజ‌కీయాలు తెర‌మీద‌కి వ‌చ్చాయి. చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు, మంత్రి ప‌రిటాల సునీత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు.. పీక్ స్టేజ్‌కి చేరే టైం వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ప‌ద‌వి విష‌యంపై టీడీపీ స్థానిక నేత‌ల్లో అంత‌ర్గ‌త యుద్ధం రాజుకుంది. ఇది ఎంత దూరం వెళ్తుంది? ఈ పోరులో కాల్వ వ‌ర్గం పైచేయి సాధిస్తుందా? ప‌రిటాల పైచేయి సాధిస్తుందా? అనేది ఆస‌క్తిగా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే.. 2014లో జ‌రిగిన జడ్‌పీటీసీ ఎన్నిక‌ల్లో టీడీపీకి ఆధిక్యం ల‌భించింది. మొత్తం 41 స్థానాలు ద‌క్కాయి. దీంతో జ‌డ్‌పీటీసీని టీడీపీ ద‌క్కించుకుంది.

ఈ క్ర‌మంలో ప‌రిటాల సునీత‌కు అనుచ‌రుడుగా పేరుప‌డ్డ‌.. దూదేకుల సామాజిక వ‌ర్గానికి చెందిన చ‌మ‌న్ సాహెబ్‌, విప్ కాల్వ అనుచ‌రుడు పూల నాగ‌రాజులు.. జ‌డ్‌పీటీసీ చైర్మ‌న్ ప‌ద‌వికి పోటీ ప‌డ్డారు. దీంతో రంగంలోకి దిగిన సీఎం చంద్ర‌బాబు.. ఇద్ద‌రినీ కాద‌న‌లేక‌.. ప‌ద‌విని ఇద్ద‌రూ చెరి రెండున్న‌రేళ్లు పంచుకోవాల‌ని సూచించారు. దీంతో అప్ప‌ట్లో ఈ వివాదం స‌ర్దుమ‌ణిగింది. అయితే, తొలిగా ప‌ద‌విని స్వీక‌రించిన చ‌మ‌న్‌కి రెండున్న‌రేళ్ల గ‌డువు పూర్త‌వ‌డంతో నాగ‌రాజుకి ఆ ప‌ద‌విని అప్ప‌గించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది.

కానీ, ప‌ద‌విని విడిచిపెట్టేందుకు చ‌మ‌న్ సిద్ధంగా లేక‌పోవ‌డం తాజా వివాదానికి కార‌ణ‌మైంది. ఈ నెల 5వ తేదీ నాటికి రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసింది. దీంతో పూల నాగరాజును జెడ్పీ పీఠం పై కూర్చోబెట్టాలని చీఫ్‌విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ‌ శ్రీనివాసులు పట్టుదలతో ఉన్నారు. అయితే తనే పదవిలో కొనసాగాలని చమన్ గట్టి పట్టుదలతో ఉన్నా రు. దీనిపై గత నెల రోజులుగా పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఈ క్రమంలో ఈ సమస్యను గత నెలలోనే జిల్లా నేత‌లు సీఎం చంద్ర‌బాబును సంప్ర‌దించారు. చమన్‌కు మంత్రి సునీత అనుకూలమైనప్పటికీ, ఆయననే కొనసాగించాలన్న విషయంపై ప్రస్తుతం తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ ఆధిప‌త్య ధోర‌ణి విష‌యంలో చ‌మ‌న్‌కే ఆమె మొగ్గుచూపే అవ‌కాశం ఉంటుంది. మ‌రి దీనిపై బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.