బాబు ప్లాన్‌తో జ‌గ‌న్‌కే మేలా..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు వైఖ‌రి ఇప్పుడు తీవ్ర వివాదాస్ప‌దం అవుతోంది. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో రైతులు అంద‌రూ త‌న‌కు స‌హ‌క‌రించార‌ని, దాదాపు 33 వేల ఎక‌రాల‌ను ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చార‌ని ప్ర‌తి చోటా చెప్పుకొనే చంద్ర‌బాబు.. ఇప్పుడు ఇదే విష‌యంలో ఆంక్ష‌లు విధిస్తున్నార‌నే టాక్ మొద‌లైంది. రైతులు త‌మ ఇష్ట‌ప్ర‌కారం కొంత మేర‌కు మాత్ర‌మే భూములు ఇచ్చార‌ని, మిగిలిన భూముల‌ను ప్ర‌భుత్వం బ‌లవంతంగా ఆక్రమించింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లువురు రైతులు ఇటీవ‌ల వైకాపా అధినేత జ‌గ‌న్‌ను క‌లిశారు. త‌మ గోడును వినిపించారు.

దీంతో రంగంలోకి దిగిన జ‌గ‌న్‌.. అమ‌రావ‌తిలో బాధిత రైతాంగుల‌ను ప‌రామ‌ర్శించేందుకు గురువారం పెద్ద ఎత్తున ప్లాన్ వేశారు. ప్ర‌ణాళిక ప్ర‌కారం ఉదయం 11 గంట‌ల స‌మ‌యంలో అమ‌రావ‌తి ప్రాంతంలో ప‌ర్య‌ట‌న ప్రారంభించారు. అయితే, జ‌గ‌న్ వేసుకున్న ప్ర‌ణాళిక‌ల‌ను ఏపీ అధికారులు పూర్తిగా మార్చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. జ‌గ‌న్ నేరుగా వెళ్లి క‌ల‌వాల‌ని భావించిన రైతుల‌ను క‌లిసేందుకు అధికారులు అనుమ‌తి ఇవ్వ‌లేదు. పైగా.. వారు సూచించిన మేర‌కే జ‌గ‌న్ రైతుల‌ను ప‌రామ‌ర్శించాల‌నే విధంగా నియంతృత్వ ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేశారు. దీంతో అధికారుల కార్యాచ‌ర‌ణ‌పై విమ‌ర్శ‌లు రేకెత్తాయి.

ఇప్పుడు ఈ విష‌యం మీదే అంద‌రూ దృష్టి పెట్టారు. నిజానికి మంగ‌ళ‌గిరి మండ‌ల ప‌రిధిలోని ప‌లు గ్రామాల ప్ర‌జ‌లు తొలి నుంచి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లోని ప్ర‌జ‌లు ద‌ళితులు కావ‌డంతో త‌మ ప‌ట్ల అధికారులు వివ‌క్ష చూపుతున్నార‌ని, త‌మ‌కు అందాల్సిన ప‌రిహారాన్ని త‌క్కువ చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇదే విష‌యాల‌పై జ‌గ‌న్‌ను వారు ఆశ్ర‌యించారు. దీంతో ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టించేందుకు, క్షేత్ర‌స్థాయిలో స‌మ‌స్య‌లు ప‌రిశీలించేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మ‌య్యారు.

అయితే, అధికారులు అడుగడుగునా ఆంక్ష‌లు విధించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీసింది. ఇదంతా సీఎం చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే జ‌ర‌గుతోంద‌ని వైకాపా ఆరోపిస్తోంది. ఇది మ‌రోర‌కంగా టీడీపీకి హాని క‌లిగించేదేన‌ని, వైకాపాకు ప‌రోక్షంగా మేలు చేస్తుంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. మొత్తానికి జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు ఆంక్ష‌లు .. ప‌రోక్షంగా జ‌గ‌న్‌కే మేలు చేస్తాయ‌ని బాబు గ‌మ‌నించాల‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.