ప్యాకేజీ బండారం బ‌య‌ట ప‌డుతోంది!

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్ర ప్ర‌జ‌లు ఎంతో ఎదురు చూస్తున్న త‌రుణంలో.. అలాంటిదే పేరు మార్చి ప్యాకేజీ రూపంలో ఇస్తున్నారు. తీసుకుంటే తప్పేంటని సీఎం చంద్ర‌బాబు స‌హా ఆయ‌న మందీ మార్చ‌లం పెద్ద ఎత్తున ప్ర‌వ‌చ‌నాలు వ‌ల్లించారు. తీరా ప్యాకేజీ వ‌చ్చి ఆరు మాసాలు గ‌డిచిపోయింది. ఇప్ప‌టికీ ఎలాంటి హామీ కార్య‌రూపం దాల్చ‌లేదు. స‌రిక‌దా ప్యాకేజీకి చ‌ట్ట బ‌ద్ధ‌త హుష్ కాకి అన్న‌చందంగానే మారిపోయింది. ఈ విష‌యంలో గ‌డుసుగా మాట్లాడిన బీజేపీ నేత‌.. ఆర్థిక మంత్రి అంత‌టాయ‌న జైట్లీ స్వ‌యంగా ప్యాకేజీ ప్ర‌క‌టిస్తే.. ఇక దానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త అవ‌స‌ర‌మా? అన్నారు. మ‌రి పీఎం అంత‌టాయ‌న మ‌న్మోహ‌న్ సింగ్ రాజ్య‌స‌భ‌లో ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తే ఏమైందో? అని ఎదురు ప్ర‌శ్నిస్తే స‌మాధానం కరువైంది. ఇక‌, ఇది ఒక్క‌టే కాదు.. ప్యాకేజీలో అనేక డొల్ల‌లు ఉన్నాయి. అవి ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతున్నాయి.

విష‌యంలోకి వెళ్తే.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్త‌న్న‌ పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులోనే ఇంకా 1800 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఇది ఎప్పుడు ఇచ్చేదీ స్ప‌ష్ట‌త లేదు. ఇక‌, విదేశీ రుణ సహాయం(ఈఏపీ) కింద అప్పుతీసుకుని ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసుకుంటే ఆ అప్పు తాను చెల్లిస్తానని కేంద్రం చెబుతోంది. దీనిని ప్యాకేజీలోనూ చేర్చారు కూడా. ఈ ప్రకారం మొత్తం 13 ప్రాజెక్టులను 37,770 కోట్ల ఖర్చుతో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో 26 వేల కోట్లు అప్పు చేస్తే.. ఈ మొత్తాన్ని అయిదేళ్లలో ఏటా 5 వేల కోట్ల చొప్పున తీసుకోవాలట. పనులనుబట్టి విడుదలవుతాయి గనక ఒకేసారి 13 ప్రాజెక్టులు ప్రతిపాదించారని తెలుస్తోంది.

ఇక‌, ప్ర‌పంచ ప్ర‌శిద్ధ న‌గ‌రంగా డెవ‌ల‌ప్ చేయాల‌ని చూస్తున్న రాజ‌ధాని అమరావతికి సంబంధించి 4779 కోట్ల ప్రణాళికలో విదేశీ రుణం 3,324 కోట్లు గా ఉంది. అయితే, ఇందులో 3324 కోట్లు అప్పు. దీంట్లో ప్రపంచ బ్యాంకు నుంచి 60 శాతం అప్పు మాత్రమేతీసుకుంటారు. మ‌రి మిగిలిన సొమ్ము మాటేమిటి? 40శాతం ఆసియా ఇన్‌ప్రాస్ట్రక్చర్‌బ్యాంక్‌(ఏఐఐబీ) నుంచి తీసుకోవాలని సంకల్పించారు. మ‌రోప‌క్క‌, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పిన ప్రకారమే ఇప్పటికి ఏపీకి అన్ని విభాగాల కింద ఇచ్చిన మొత్తం దాదాపు ఎనిమిది వేలకోట్ల మేరకు వుంటుంది. కనీసం మొదటి ఏడాది రెవెన్యూ లోటును కూడా పూర్తిగా భర్తీ చేయలేదు.

వాస్తవానికి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన ప్రకటనలో ప్రత్యేక హౌదా ఒక అంశమే. మరో ఆరు విషయాలుదానిలో వున్నాయి.1. ప్రత్యేక హౌదా 2. రెండురాష్ట్రాలలోనూ పారిశ్రామికాభివృద్ధికి పన్ను రాయితీలు 3.ఒరిస్సాలో కోరాపుట్‌ బోలంగిర్‌ కల్హాంది ప్రత్యేక ప్కాకేజీ, 4.పోలవరం పునరావాసం 5. సిబ్బంది ఆర్థిక వనరుల కేటాయింపు 6.14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వరకూ ఆగకుండానే రెవెన్యూ లోటు భర్తీ. ఇవన్నీ చెప్పిన తర్వాత ముగింపులో మన్మోహన్‌ అన్న మాట మరింత ముఖ్యమైనది. ”ఈ చర్యల ద్వారా మేము కేవలం తెలంగాణ ఏర్పాటుకే గాక సీమాంధ్ర సౌభాగ్య సంక్షేమాలకు గట్టిగా కట్టుబడివున్నామని తెలియజేయదలచాము” అని పేర్కొన్నారు. మ‌రి ఇవ‌న్నీ ప్ర‌స్తుత ప్ర‌భుత్వం చేయ‌క‌పోగా క‌ల్ల‌బొల్లి లెక్క‌ల‌తో పొద్దు పుచ్చుతుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి చంద్ర‌బాబు అండ్‌కోలు వంత పాడుతుండ‌డం మ‌రింత విస్మ‌యం!!