ప‌వ‌న్ విష‌యంలో టీడీపీ దొరికిపోతోందిగా..!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో టీడీపీ ఆది నుంచి అనుస‌రిస్తున్న వైఖ‌రే మ‌రోద‌ఫా స్ప‌ష్ట‌మైంది! ప‌వ‌న్‌ని విమ‌ర్శించేందుకు టీడీపీ నేత‌లు ఎంత‌మాత్రం ధైర్యం చేయ‌లేక‌పోతున్నార‌న‌డానికి నిన్న జ‌రిగిన విశాఖ ఆందోళ‌నే పెద్ద ఉదాహ‌ర‌ణ‌. నిజానికి గురువారం విశాఖ‌లో త‌ల‌పెట్టిన ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఏ ఒక్క‌రిదో కాదు! నిజానికి అది స‌క్సెస్ అయి ఉంటే.. అప్పుడు తెలిసేది.. మాదంటే మాద‌ని.. అంద‌రూ కొట్టుకు చ‌ చ్చేవాళ్లు. కానీ, పోలీసు నిర్బంధాల బూట్ల చ‌ప్పుళ్ల‌లో ఆ ఆందోళ‌న స‌ముద్రంలో క‌లిసిపోవ‌డంతో.. చెడ్డ‌పేరు మాత్రం జ‌గ‌న్‌కి ఆపాదించేస్తున్నారు. అస‌లు విష‌యానికి వ‌స్తే..

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో అటు వైకాపా నేత‌లు, అధినేత జ‌గ‌న్ కూడా మొద‌టి నుంచి ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలోని ప్ర‌భుత్వాల‌ను విమ‌ర్శిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వాస్త‌వానికి ఏపీలోని ఉత్తరాంధ్ర యువ‌త సోష‌ల్ మీడియాలో ఇచ్చిన పిలుపు నేప‌థ్యంలో తొలుత స్పందించింది జ‌న‌సేనాని ప‌వ‌న్‌. ఆ ఆందోళ‌న‌కు త‌న మద్దతు ఉంటుంద‌ని, యువ‌త రెచ్చిపోవాల‌ని ఆయ‌న పెద్ద ఎత్తున ట్వీట్ చేయ‌డంతో పాటు రెచ్చ‌గోట్టేలా.. గుంటూరు శేషేంద్ర శ‌ర్మ గారు రాసిన క‌విత‌తో రోజు రోజంతా మీడియాలో నిలిచాడు. ఆ త‌ర్వాత జ‌గ‌న్.. తానెక్క‌డ వెనుక‌బ‌డి పోతానో అనుకుని మొత్తం భేజాన వేసుకున్నాడు.

ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ బ‌య‌ట ప‌డింది. వాస్త‌వానికి మౌన ప్ర‌ద‌ర్శ‌న‌కి పిలుపు నిచ్చింది విశాఖ యువ‌త‌. దీనికి మ‌ద్ద‌తు ప‌లికింది ప‌వ‌న్‌. వీటిని వ‌దిలేసిన టీడీపీ నేత‌లు… జ‌గ‌న్‌పై ఒంటి కాలిపై లేవ‌డంతోపాటు.. సాక్షాత్తూ.. చంద్ర‌బాబు సైతం మ‌సిపూసి మారేడు కాయ చేశారు. నిజానికి మౌన ప్ర‌ద‌ర్శ‌న‌కు అనుమ‌తి ఇస్తే త‌ప్పేంట‌ని అడిగిన వారు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్నారు. అయితే, అదంతా సోష‌ల్ మీడియాకే ప‌రిమిత‌మైపోయింది. కానీ, ఈ విష‌యంలో ప్ర‌త్య‌క్షంగా ప‌వ‌న్ పాత్ర క‌నిపిస్తున్నా.. ఆయ‌న‌ను విమ‌ర్శించే సాహ‌సం తెలుగు త‌మ్ముళ్లు చేయ‌లేక‌పోతున్నారు.

ఈ ఉద్య‌మానికి నిజంగా జ‌గ‌న్‌తోపాటు ముందో వెనుకో.. ప‌వ‌న్ కూడా వ‌చ్చి ఉంటే ఎలా ఉండేది? అన్న‌ది ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. నిజానికి మొద‌టి నుంచి ప‌వ‌న్‌పై త‌ట‌స్థ వైఖ‌రి అవ‌లంబిస్తున్న టీడీపీ ఇప్పుడు కూడా అలాగే వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న కామెంట్లు విన‌బ‌డుతున్నాయి. 2014లో టీడీపీకి మ‌ద్ద‌తిచ్చిన ప‌వ‌న్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డంలో ఆచి తూచి స్పందిస్తున్నాడు. అదేవిధంగా టీడీపీకూడా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే అనిపిస్తోంది.

నిజానికి విశాఖ‌లో ఉద్య‌మానికి యువ‌త‌ను రెచ్చ‌గొట్టింది.. పురిగొల్పింది ఎవ‌రైనా ఉంటే.. అది ఫ‌స్ట్ ప‌వ‌నే! ఈ విష‌యాన్ని విడిచి పెట్టిన టీడీపీ నేత‌లు.. జ‌గ‌న్‌పై కామెంట్లు చేయ‌డం, జ‌గ‌న్ వ‌ల్ల విశాఖ త‌గ‌ల బ‌డుతోంద‌ని అన‌డం అమానుషం. ఇప్ప‌టికైనా.. స‌రే.. అస‌లు విశాఖ యువ‌త‌కు మ‌ద్ద‌తు ఎవ‌రు ఏ స్థాయిలో ప్ర‌క‌టించారో తెలుసుకుని మాట్లాడితే మంచిద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.