ఆ ఇద్ద‌రు మంత్రుల‌ను ఆద‌ర్శంగా తీసుకోమంటోన్న చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ మంత్రులు, సీనియ‌ర్ నేత‌ల‌కు ఇటీవ‌ల జ‌రిగిన ఓ స‌మావేశంలో పెద్ద ఎత్తున క్లాస్ ఇచ్చారు. ముఖ్యంగా గ‌త కొన్నాళ్లుగా తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మంత్రి రావెల కిశోర్ బాబు, పీత‌ల సుజాతలు స‌హా సీఎంపై నోరు పారేసుకుంటున్న క‌ర‌ణం బ‌ల‌రాం వంటి వారిని ఉద్దేశించి చంద్ర‌బాబు కామెంట్లు చేశార‌ని తమ్ముళ్లు తెగ చెవులు కొరుక్కుంటున్నారు. బాబేంటి ఇలా ఇన్‌డైరెక్ట్‌గా క్లాస్ పీకారేంటి అని కూడా అనుకున్నార‌ట‌. మొత్తానికి తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన బాబు వ్యాఖ్య‌లు గ‌మ‌నిస్తే.. త‌న కేబినెట్‌లోని మంత్రులు య‌న‌మ‌ల‌, రాజ‌ప్ప‌ల‌కు చంద్ర‌బాబు పెద్ద ఎత్తున స‌పోర్ట్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ ఇద్ద‌రు నేత‌లు అటు పార్టీలోనూ ఇటు ప్ర‌భుత్వంలోనూ ఎంతో సీనియ‌ర్ల‌ని చెప్పుకొచ్చిన చంద్ర‌బాబు.. వారి వ‌ల్ల త‌న‌కు ఎలాంటి త‌ల‌నొప్పులూ లేవ‌ని చెప్ప‌డం ఇప్పుడు ప్ర‌ధానంగా చ‌ర్చ‌నీయాంశమైంది. య‌న‌మ‌ల‌, రాజ‌ప్ప‌ల ప్ర‌వ‌ర్త‌న త‌న‌కు ఎటువంటి తలనొప్పులు కలిగించలేదని, పార్టీ ప్రతిష్టను మంటగలపలేని, వారిని చూసి వీరు నేర్చుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో సీనియర్‌ నాయకులు, నూతనంగా పార్టీలోకి వచ్చిన నాయకులు, మంత్రిపదవుల్లో ఉన్నవారు, శాసనసభ్యులు, గోరంత విషయాలను కొండంతగా భావిస్తూ వీధినపడుతున్నారని, ఎన్నిసార్లు తాను హెచ్చరించినా పద్దతి మార్చుకోవడం లేదని బాబు ఒకింత అస‌హ‌నం కూడా వ్య‌క్తం చేశార‌ట‌.

అదేస‌మ‌యంలో ఇలా వ్య‌వ‌హ‌రించిన నేత‌ల‌పై సరైన సమయంలో చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చ‌రించిన‌ట్టు తెలిసింది. ఈ ఇద్ద‌రు నేత‌లూ 33 ఏళ్ల నుంచి పార్టీలో ఉంటూ పదవులు ఉన్నా లేకున్నా..అధినేతకు చంద్రబాబుకు నమ్మకస్తులుగా, పార్టీకి వీరవిధేయులుగా మెలిగార‌ని కూడా బాబు కితాబివ్వ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా యనమల ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచారు.. మంత్రిగా, స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించి ఆయా పదవులకే వన్నె తెచ్చారని బాబు కొనియాడార‌ట‌. ఏ నాడూ పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ ఏ ఒక్కరిపై వీరిద్దరూ విమర్శలు చేయలేద‌ని అన్నార‌ట‌.

అయితే, ఇటీవ‌ల కాలంలో పార్టీలోకి వ‌చ్చిన కొంద‌రు స‌హా కొంద‌రు సీనియ‌ర్లు కూడా టీడీపీ స‌హా త‌న‌పై వ్యంగ్యాస్త్రాలు వ‌దులుతున్నార‌ని, ఇది స‌రికాద‌ని హిత‌వు ప‌లికార‌ట చంద్ర‌బాబు. ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రికీ ఉన్నంత‌లో ఉన్నంత ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు చెప్పారు. మ‌రికొంద‌రికి నామినేట్ ప‌ద‌వులు కూడా క‌ట్ట‌బెట్టిన‌ట్టు వివ‌రించారు. అయినా .. కొంద‌రు మాత్రం అటు పార్టీకి, ఇటు త‌న‌కు చెడ్డ‌పేరు వ‌చ్చేలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం స‌రికాద‌ని బాబు సునిసితంగా క్లాస్ పీకార‌ట చంద్ర‌బాబు.. మ‌రి ఆ కొంద‌రు తెలుసుకుంటారో లేదో చూడాలి!!