టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో సర్వే భయం

తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు బాట ప‌ట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల ప‌నితీరు, ప్ర‌జ‌ల్లో వారిపై ఉన్న అభిప్రాయం? వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు కేటాయిస్తే.. ఎంత వ‌ర‌కు నెగ్గుతారు? వ‌ంటి ప‌లు విష‌యాల‌పై చంద్ర‌బాబు మాదిరిగానే సీఎం కేసీఆర్ కూడా త‌న టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌పై స‌ర్వే చేయించార‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌యంపైనే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు రేగుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏంటంటే.. స‌ర్వేలో ఫెయిల్ అయిన ఎమ్మెల్యేల‌కు వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో సీట్లు ఇచ్చే ప్ర‌స‌క్తి ఉండ‌ద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతుండ‌డ‌మే.

నిజానికి ఇప్పుడు ఏ పార్టీలోనూ లేని విధంగా టీఆర్ ఎస్‌లో నేత‌ల సంఖ్య భారీగా ఉంది. దీంతో అంద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్టు సంపాదించాల‌ని పెద్ద ఎత్తున ఆశ‌లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే విష‌యంపై టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇంత మంది నేత‌ల‌కు టికెట్లు అంటే క‌ష్ట‌మేక‌దా? అని అనుకుంటున్నారు. మ‌రోప‌క్క‌, నియోజ‌క‌వ‌ర్గాల పెంపు ఏమైనా సాధ్య‌మ‌వుతుందా? అంటే ఈ విష‌యంలో ఇప్ప‌టికే పార్లమెంటులో కేంద్రం స్ప‌ష్టం చేసింది. 2026 వ‌ర‌కు ఎలాంటి నియోజ‌క‌వ‌ర్గాల పెంపు ఉండ‌ద‌ని కేంద్రం వెల్ల‌డించింది.

మ‌రి ఈ నేప‌థ్యంలో ఉన్న 117 అసెంబ్లీ స్థానాల్లో వంద‌ల మందిని ఎలా స‌ర్దుబాటు చేయ‌డం అని ఆలోచించిన కేసీఆర్ స‌ర్వే మార్గం ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. స‌ర్వేలో మార్క‌లు ఆధారంగా కొంద‌రిని ఎలిమినేట్ చేస్తే.. మ‌రికొంద‌రికి వారి స్థానాల్లో సీట్లు ఇవ్వొచ్చ‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో సర్వేసాగిన‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విష‌యంపైనే దిగులు పెట్టుకున్న కొంద‌రు ఎమ్మెల్యేలు.. త‌మ‌కు స‌ర్వేలో వ్య‌తిరేకంగా మార్కులు ప‌డితే.. ఎలా? అని వారు ఇప్ప‌టి నుంచే కీలక మంత్రులైన కేసీఆర్ త‌న‌యుడు, మేన‌ల్లుడు కేటీఆర్‌, హ‌రీష్‌ల చుట్టూ తిరుగుతున్నార‌ని స‌మాచారం.

అయితే, విచిత్రంగా వారి నుంచి కూడా త‌మ‌కు ఈ స‌ర్వే విష‌యం ఏమీ తెలీద‌ని స‌మాధానం వ‌స్తుండ‌డంతో అంద‌రూ ఏం చేయాలో తెలియ‌క బిక్క‌మొహం వేస్తున్నారు. స‌రైన స‌మ‌యంలో కేసీఆర్ స‌రైన పంథా ఎంచుకున్నార‌ని ఆశావ‌హులు మాత్రం మురిసిపోతున్నారు. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి. ఇదిలావుంటే, అధికార కేసీఆర్ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శించారు. వరంగ‌ల్‌లో నిర్వ‌హించిన ఆందోళ‌న‌లో పాల్గొన్న పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. మ‌రి వీళ్ల ఆశ‌లు ఎంత మేర‌కు నెర‌వేరుతాయో ప్ర‌జ‌లే చెప్పాలి.