జ‌న‌సేన-సీపీఐ జ‌ట్టు ఖాయ‌మైందా?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ నేతృత్వంలోని జ‌న‌సేన‌, జాతీయ పార్టీ సీపీఐల మ‌ధ్య పొత్తు కుదిరిందా? 2019 ఎన్నిక‌ల్లో కామ్రేడ్ల‌తో క‌లిసి ప‌వ‌న్ పొలిటిక‌ల్ పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారా? అంత‌క‌న్నా ముందు.. రాష్ట్రంలో పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాల ప‌క్షాన పోరాడేందుకు రెండు ప‌క్షాలూ రెడీ అవుతున్నాయా? అంటే.. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామకృష్ణ చెప్పిన మాట‌ల‌ను బ‌ట్టి నిజ‌మేన‌ని అనిపిస్తోంది. ప్ర‌జాచైత‌న్య పేరిట యాత్ర‌లు నిర్వ‌హిస్తున్న రామ‌కృష్ణ‌.. నిన్న విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం వ‌చ్చారు. అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ.. ఓ ఆస‌క్తి క‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు. తాము ప్ర‌జా పోరాటాల కోసం రానున్న రోజుల్లో ప‌వ‌న్ స‌ర‌స‌న చేరి ప్ర‌జాపోరాటాల‌కు సిద్ధ‌మ‌వుతామ‌ని ప్ర‌క‌టించారు.

నిజానికి రాష్ట్రంలో గ‌తంలో టీడీపీతో జ‌త‌క‌ట్టిన సీపీఐ.. ఆ త‌ర్వాత ఆయ‌న బీజేపీని అక్కున చేర్చుకోవ‌డంతో ఒంట‌రిగా ఉండిపోయింది. తోడుగా సీపీఎం ఉన్నా.. ఎన్నిసార్లు రెండూ ఐక్య పోరాటాల‌కు దిగుతామ‌ని ప్ర‌తిజ్ఞ‌లు చేసుకున్నా.. అన్నిసార్లూ ఇరు పార్టీలూ చెరోదారిలో వెళ్ల‌డం మామూలుగా మారిపోయింది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు సీపీఐ జ‌న‌సేన వంక చూస్తోంది. 2014లో స్థాపించి.. ఇంకా పూర్తిస్థాయిలో క‌న్ను కూడా తెరుచుకోని జ‌న‌సేన‌తో జ‌ట్టుక‌ట్టేందుకు జాతీయ పార్టీ సిద్ధం కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. గ‌త ఎన్నిక‌ల్లో సొంతంగా ఒక్క‌సీటు కూడా సాధించ‌లేని సీపీఐ ఇప్ప‌డు క‌నీసం ప‌వ‌న్‌తో జ‌త‌క‌ట్ట‌డం ద్వారా అసెంబ్లీలోకి అడుగుపెట్టాల‌ని కామ్రేడ్లు ప్లాన్ వేసిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రోప‌క్క‌, ప‌వ‌న్ ఇంకా త‌న పూర్తిస్థాయి పొలిటిక‌ల్ అజెండాను వెల్ల‌డించ‌లేదు. పైగా పార్టీ కేడ‌ర్‌ను కూడా క్షేత్ర‌స్థాయిలో ప్ర‌క‌టించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఎవ‌రితో పొత్తులు పెట్టుకుంటాడు? ఎవ‌రిని అక్కున చేర్చుకుంటాడు? వ‌ంటి విష‌యాలు ఇప్ప‌టికిప్పుడు తెలియ‌క‌పోయినా.. సీపీఐ మాత్రం.. తాము జ‌న‌సేన‌తో జ‌ట్టుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశం. ఇదే నిజ‌మైతే.. ప‌వ‌న్కి సీపీఐ క‌న్నా.. సీపీఐకి ప‌వ‌న్‌తోనే ఎక్కువ లాభం అవుతుంద‌న్న‌ది విశ్లేష‌కుల ఉవాచ‌! మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి .