ఏపీలో సీనియ‌ర్ మంత్రికే బెదిరింపులా..!

రాష్ట్ర కేబినెట్‌లో ఉన్న ముగ్గురు మంత్రుల త‌న‌యుల తీరు వివాదాస్ప‌దంగా మారింది, కొంత కాలం నుంచి వివిధ మంత్రుల కొడుకుల తీరు టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన విష‌యం తెలిసిందే! అయితే ప్ర‌స్తుతం ముగ్గురు మంత్రుల‌ త‌న‌యులు ఒక సీనియ‌ర్ మంత్రికే ఝ‌ల‌క్ ఇచ్చారు. వారి ఆగ‌డాల‌తో విసిగి వేశారిన ఆ సీనియ‌ర్ మంత్రి.. ఈ విష‌యంపై పార్టీ అధినేత‌కే ఫిర్యాదు చేసినా.. అక్క‌డా ఆయ‌న‌కు చుక్కెదురైంద‌ని స‌మాచారం. తానేమీ కల్పించుకోలేన‌ని.. నేరుగా ఆ మంత్రుల‌తోనే మాట్లాడుకోవాల‌ని చెప్ప‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయార‌ట స‌దరు సీనియ‌ర్‌ మంత్రి!!

ఉత్తర కోస్తా ప్రాంతానికి చెందిన సీనియర్‌ మంత్రి కుటుంబ సభ్యులకు, ఒక పెద్ద ప్రైవేటు సంస్థ మధ్య వ్యాపార లావాదేవీల్లో గొడవలొచ్చాయి. మంత్రి కుటుంబ సభ్యులతో వివాదాలు రావడంతో ఆ కంపెనీ చాకచక్యంగా మరో ముగ్గురు అమాత్యుల కుమారులను ఆశ్రయించింది. రాయలసీమ, దక్షిణాంధ్ర, ఉత్తరాంధ్రలకు చెందిన ముగ్గురు మంత్రుల తనయులు రంగంలోకి దిగారు. ప్రైవేటు కంపెనీ తరఫున వకాల్తా పుచ్చుకొని సీనియర్‌ మంత్రి కుటుంబ సభ్యులను బెదిరించినట్లు తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ పెట్టినట్లు సమాచారం.

దీంతో ఆగ్రహించిన ఆ సీనియరు మంత్రి నేరుగా పార్టీ అధినేతకు మొర‌పెట్టుకున్నార‌ట‌. `మీరు కేబినెట్‌లో సీనియర్‌. ఇంత చిన్న విషయం కూడా నాకు చెప్పాలా? మీరే ఆ ముగ్గురు మినిస్టర్స్‌తో మాట్లాడుకోండి. మీ మాట వినరా?’ అని అన‌డంతో ఒక్క‌సారిగా అవాక్క‌య్యార‌ట స‌దరు మంత్రి! ఈ విష‌యాన్నిమంత్రుల దృష్టికి సీనియర్‌ తీసికెళ్లార‌ట‌. రాయలసీమకు చెందిన మంత్రి అయితే ‘అన్నా నేను చెబితే మా అబ్బాయి వినడు. వాడు చేసుకునేదేదో వాడు చేసుకుంటున్నాడు’ అని చేతులెత్తేశార‌ట‌. మిగిలిన వారి నుంచి కూడా ఊహించ‌ని స‌మాధానమే ఎదురైంద‌ట‌.

మంత్రుల‌ కుమారుల అక్రమ దందాలపై ఫిర్యాదు చేసినా సీఎం లైట్‌గా తీస్కోవడంతో సీనియ‌ర్ మంత్రి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సన్నిహితులు చెబుతున్నారు. తనలాంటి వారికే ఇలా జరిగితే మామూలు వాళ్ల గతేంటని తన అనుచరుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. గ‌తంలోలా పార్టీలో, ప్రభుత్వంలో క్రమశిక్షణ లేదని, బయటపడ్డ తప్పులను సరిదిద్దే స్థితిలో తమ అధినేత లేరని సీనియర్‌ తన దగ్గరి వారి చెంత ఆవేదన చెందుతున్నార‌ట‌.