గుడివాడ‌లో టీడీపీ, వైసీపీ డిష్యుం డిష్యుం!

ఏపీ పాలిటిక్స్‌లో ప‌చ్చ‌గ‌డ్డి వేసినా.. భ‌గ్గుమ‌నే వాతావ‌ర‌ణం ఉన్న వైకాపా, టీడీపీ నేత‌ల మ‌ధ్య ప‌రిస్థితి శ‌నివారం పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయింది. తాను పెంచి పోషించిన నేత త‌న మాటను లెక్క‌చేయ‌కుండా.. టీడీపీ పంచ‌న చేర‌డంతో త‌ట్టుకోలేక పోయిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. అదును చూసుకుని దెబ్బేశారు. తాజాగా శ‌నివారం గుడివాడ మునిసిప‌ల్ స‌వావేశాన్ని త‌న ఆధిప‌త్య వేదిక‌గా మార్చుకునేందుకు య‌త్నించి స‌ఫ‌ల‌మ‌య్యారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మాట‌ల‌కే ప‌రిమిత‌మైన గుడివాడ నేత‌ల మధ్య విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌లు.. చేత‌లు దాటిపోయాయి. విష‌యంలోకి వెళ్లిపోతే..

గుడివాడలో మొత్తం 36 మునిసిప‌ల్ స్థానాల‌కు జ‌రిగిన ఎన్నికల్లో వైకాపా 21 చోట్ల గెల‌వ‌గా టీడీపీ నుంచి 15 మంది గెలిచారు. దీంతో వైకాపా తరపున ఎమ్మెల్యే కొడాలి నాని త‌న‌ ముఖ్య అనుచరుడైనయలవర్తి శ్రీనివాసరావును చైర్మన్‌గా నియమించారు. అయితే, రాష్ట్రంలో ఇటీవ‌ల వెల్లువెత్తిన జంపింగ్‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా య‌ల‌మంచిలి త‌న 9 మంది అనుచ‌రుల‌తో స‌హా టీడీపీ పంచ‌న చేరిపోయారు. ఒక‌ప‌క్క కొడాలి వ‌ద్ద‌ని వారిస్తున్నా.. వినిపించుకోకుండా.. య‌ల‌మంచిలి సైకిలెక్కేశారు. దీంతో అస‌లే ముక్కుమీద కోపంతో ఊగిపోయే కొడాలి.. య‌ల‌మంచిలిపై వాడు, వీడు అంటూ రెచ్చిపోవ‌డం తెలిసిందే.

ఈ క్ర‌మంలో కొడాలి అనుచ‌రులు సైతం య‌ల‌మంచిలిపై ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ఛాన్స్ కోసం ఎదురు చూశారు. ఆ స‌మ‌యం శ‌నివారం స‌మావేశం రూపంలో అంది వ‌చ్చింది. మునిసిపాలిటీకి సంబంధించి సుమారు రూ.7 కోట్ల లెక్క‌లు చూసేందుకు కౌన్సిల‌ర్ల స‌మావేశాన్ని శ‌నివారం ఏర్పాటు చేశారు. దీనికి చైర్మ‌న్ హోదాలో య‌ల‌మంచిలి వ‌చ్చారు. ఈ స‌య‌మంలో క‌లుగ జేసుకున్న కొడాలి స‌హా ఆయ‌న‌ వ‌ర్గం య‌ల‌మంచిలిపై తొలుత మాట‌ల యుద్ధానికి దిగాయి. ముందు వైసీపీకి రాజీనామా చేసి.. ఆ త‌ర్వాత టీడీపీ సైకిల్ ఎక్కు అంటూ వారు దూష‌ణ‌ల‌కు దిగారు. దీంతో య‌ల‌మంచిలిని స‌హా టీపీడీ వ‌ర్గం కూడా అంతేస్థాయిలో బ‌దులిచ్చింది.

ఈ ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో కొడాలి వ‌ర్గం య‌ల‌మంచిలిపై పిడిగుద్దులు కురిపించింది. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కౌల్సిలర్లు ఇరుప‌క్షాల వాళ్లూ.. పెద్ద ఎత్తున వ్య‌తిరేక నినాదాలు చేయ‌డంతో అస‌లు ఏం జ‌రుగుతోందో కూడా అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వ‌ర్గాల‌నూ శాంతింప‌జేశారు. మొత్తానికి ఈ ఘ‌ర్ష‌ణ మ‌రోసారి ఇలా ర‌చ్చ‌కెక్క‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌జాప్ర‌తినిధులు ఇలా బ‌రితెగించి కొట్టుకుంటే సామాన్యుల‌ప రిస్థితి ఏంట‌నే ప్ర‌శ్న వ‌స్తోంది.