ఎర్ర‌బెల్లి.. ఆశ నిరాశేనా?!

నిత్యం మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసే మాజీ టీటీడీపీ నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ఓ అనూహ్య ప‌రిణామంగా టీఆర్ ఎస్‌లోకి జంప్ చేయ‌డం, కేసీఆర్ ప‌క్క‌న నిల‌బ‌డి.. గులాబీ కండువా క‌ప్పుకోవ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో అస‌లు మీడియా కే చిక్క‌డం లేదు. పోనీ ఏమ‌న్నా అంత బిజీగా మారిపోయాడా? ఏద‌న్నా ప‌ద‌విలో ఒదిగిపోయాడా? అంటే అది కూడా కాద‌ట‌! ఎర్ర‌బెల్లి ఇప్పుడు మౌన వ్ర‌తం చేస్తున్న‌డంట‌! మ‌రి ఎందుకు చేస్త‌న్న‌డు? కార‌ణ‌మేంది? అనేగా మీ పశ్న‌లు! జెపుతా ఇనుకోండి!

టీడీపీ సీనియ‌ర్ నేత‌గా ఉన్న ఎర్ర‌బెల్లికి అంద‌రి నేత‌ల్లాగానే ఒక్క‌సారైనా అమాత్యుడు కావాల‌నే కోరిక బ‌లంగా ఉండేద‌ట‌! అయితే, తెలంగాణ‌లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇక ఆ పార్టీని ప‌ట్టుకుని వేలాడితే.. ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని అనుకున్న మ‌రుక్ష‌ణ‌మే.. బాబుపై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు ఏవీ చేయ‌కుండానే సైలెంట్‌గా కారెక్కేశారు. దీంతో ఎర్ర‌బెల్లి త‌న ల‌క్ష్యాన్ని సాధించే క్ర‌మంలోనే పార్టీ నుంచి జంప్ చేశాడ‌ని అంద‌రూ అనుకున్నారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. ఎన్నో ఆశ‌ల‌తో మంత్రి ప‌ద‌వి కోసం టీఆర్ఎస్‌లో చేరిన ఎర్ర‌బెల్లిని ఇప్పుడు ఆ పార్టీలో ప‌ట్టించుకునే వారే లేర‌ట‌.

పార్టీలో చేర‌క‌ముందు.. రోజుల‌కు రెండు సార్ల‌యినా.. సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడేవాడ‌ట‌. ఇప్పుడు ఫోనులేదూ.. మాటాలేదు! అంతేకాదు, టీఆర్ఎస్‌లో చేరిన కొత్తలో మాట‌మాటికి సీఎం కేసీఆర్ ప‌క్క‌న ఎక్కువుగా క‌నిపించే ఎర్ర‌బెల్లి ఇప్పుడు తెర‌మీద అస్స‌లు క‌న‌ప‌డ‌డం లేదు. క‌నీసం వారానికో సారి అయినా ప్రెస్‌మీట్ పెట్టి హంగామా చేసే ఆయ‌న ఇప్పుడు వార్త‌ల్లో క‌న‌ప‌డ‌డం లేదు. దీనికి కేవ‌లం ఇక్క‌డ కూడా ఎర్ర‌బెల్లికి కోరిక తీరే మార్గం క‌నిపించ‌డంలేద‌ని స్ప‌ష్ట‌మైపోయింది. ఎందుకంటే.. ఎర్ర‌బెల్లి సామాజిక‌వ‌ర్గం నుంచి సీఎం కేసీఆర్‌తో పాటు హ‌రీష్‌-కేటీఆర్‌-జూప‌ల్లి కృష్ణారావు ఉన్నారు. వీరిలో జూప‌ల్లిని త‌ప్పిస్తేనే ఎర్ర‌బెల్లికి ఛాన్స్ రావొచ్చు.

అయితే కేసీఆర్ జూప‌ల్లిని త‌ప్పించేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌. దీంతో ఎర్ర‌బెల్లి ఇప్పుడు మౌన‌వ్ర‌తం పాటిస్తున్నాడ‌న్న టాక్ వినిపిస్తోంది. మ‌రి మౌనం పాటించినంత మాత్రాన కేసీఆర్ క‌రుగుతారా? అంటే ప్ర‌శ్నార్థ‌క‌మే!! మ‌రి ఎర్ర‌బెల్లి మౌనం ఎందుకు పాటిస్తున్నారు? ఆయ‌న‌కే తెలియాలి. ఇక‌, ఇప్పుడు మాత్రం ఆయ‌న స‌న్నిహితులు ద‌య‌న్నా.. ఎక్క‌డా అనే స్థాయికి వ‌చ్చారు. ఏం జ‌రుగుతుందో చూడాలి.