గంటా ఆస్తుల్లో ప్ర‌భుత్వ భూములు..!

ఏపీ మాన‌వ వ‌న‌రుల మంత్రి గంటా శ్రీనివాస‌రావు పేరు ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో వినిపిస్తోంది. ప్ర‌భుత్వ భూములు ఆయ‌న ఆస్తుల జాబితాలో ఉండ‌డమే దీనికి ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. ఆయ‌నేమ‌న్నా ఆ ఆస్తుల‌ను కొనుగోలు చేశారా? అంటే లేద‌ని ఆక్ర‌మించుకున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళిపోతే.. మంత్రి గంటా గ‌తంలో డైరెక్ట‌ర్‌గా ఉన్న ప్ర‌త్యూష కంపెనీకి ఇండియ‌న్ బ్యాంకు దాదాపు 190 కోట్ల రూపాయ‌లు అప్పుగా ఇచ్చింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ప‌లువురు బ్యాంకుకు ష్యూరిటీగా ఉన్నారు. వీరిలో గంటా శ్రీనివాస‌రావు కూడా ఉన్నారు. అయితే, ఇటీవల స‌ద‌రు కంపెనీ ఆ అప్పు చెల్లించ‌డం లేద‌ని ర‌చ్చ‌కెక్కిన బ్యాంకు అధికారులు ష్యూరిటీ హోల్డ‌ర్స్ అంద‌రికీ నోటీసులు పంప‌డం ప్రారంభించారు.

ఈ క్ర‌మంలో మంత్రి గంటాకు కూడా నోటీసులు పంపారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా ఒప్పుకున్నారు కూడా!. ఇక‌, ఆయ‌న బ్యాంకు స‌మ‌ర్పించిన ష్యూరిటీలో ప‌లు స్థ‌లాలు ప్ర‌భుత్వ భూములుగా గుర్తించ‌డం ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారింది. బ్యాంకు ష్యూరిటీ కింద ఆనందపురం మండలం వేములవలస గ్రామంలోని 122/9, 10,11,12,13,14,15 సర్వేనంబర్లలోని భూమిని బ్యాంకుకు స‌మ‌ర్పించారు. అయితే ఇందులో సర్వేనంబర్లు.. 122/9, 10,11,12లోని భూమి ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉంది. అంటే ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి బ్యాంకులో తనఖాపెట్టి రుణం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ విష‌యం అంత తేలిక‌గా తీసుకునేది కాదు. సాధార‌ణ జ‌నం ఓ గ‌ట్టు ప‌క్క‌నో పుట్ట‌ప‌క్క‌నో బ‌తికేందుకు నాలుగు తాటాకులు క‌ప్పుకొని ఏదైనా ఏర్పాటు చేసుకుంటే హుటాహుటిన వ‌చ్చి పీకేసే విశాఖ అధికారులు ఇలా ప్ర‌భుత్వ భూముల‌ను మంత్రిస్థానంలో ఉన్న వ్య‌క్తి.. క‌బ్జా చేసిన‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌పై ఎలా స్పందిస్తారో చూడాలి. నిజానికి మంత్రి గంటా శ్రీనివాస‌రావుకు ప‌లు ప్రాంతాల్లో ఆస్తులున్నాయి. కానీ, ఇప్పుడు వెలుగు చూసిన భూములు మాత్రం ప్ర‌భుత్వ ప‌రిధిలోని వ‌ని తెలుస్తోంది. ఇక‌, ఎప్ప‌ట్లాగానే మంత్రి, ఆయ‌న మార్బ‌లం త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లను కొట్టి పారేస్తున్నారు. ప్ర‌త్యూష కంపెనీ వ్య‌వ‌హారంపై ఉత్త‌రాంధ్ర అట్టుడుగుతున్న ఈ క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.