కోదండ‌రాం సార్ విమ‌ర్శ‌ల స్టైల్ మార్చండి

తెలంగాణ ఉద్య‌మంలో అన్నివ‌ర్గాల‌ను ఏకం చేసిన ఘ‌నత జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రామ్‌కి ద‌క్కుతుంది. ప్ర‌స్తుతం తెలంగాణ సెంటిమెంట్‌ను ప్ర‌జల్లోకి తీసుకెళ్లి అంద‌రినీ మ‌మేకం చేశారు. అయితే కొద్ది కాలంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ఆయ‌న.. ఇంకా ఏపీకి చెందిన నేత‌లు, కాంట్రాక్టర్ల‌పై చేస్తున్న ఆరోప‌ణ‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రం సాధించుకుని మూడేళ్లు గ‌డిచినా.. ఉద్య‌మ స‌మ‌యంలో చేసిన‌ట్టు గానే ఇంకా విమ‌ర్శ‌లు చేయ‌డంపై మేధావులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేస్తున్నారు. విమ‌ర్శలు చేసే పద్ధ‌తి మార్చుకోవాల‌ని సూచిస్తున్నారు.

కొంత కాలంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై కోదండ‌రామ్ తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అధికారం కొంత మంది చేతుల్లోనే ఉంద‌ని ఆయ‌న దుయ్య‌బడుతున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌డుతున్న‌ ప్రాజెక్టుల్లో అవినీతి జ‌రుగుతోంద‌ని విమ‌ర్శిస్తున్నారు. అయితే ఇంత వ‌రకూ బాగానే ఉన్నా..ఆదివారం ఆయ‌న‌ సీమాంధ్ర‌కు చెందిన వారిపై చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి, ఆంధ్రుల ఆధిప‌త్యం ఇంకా కొన‌సాగుతోంద‌ని, ప్రాజెక్టుల‌న్నీ వారికే దక్క‌తున్నాయ‌ని ఉద్య‌మ స‌మ‌యంలో విమ‌ర్శించిన‌ట్లు ఇప్పుడు కూడా మాట్లాడ‌టం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

విభజన తర్వాత కూడా వలసాధిపత్యం, ఆంధ్రాధిపత్యం కొనసాగుతోంద‌ని కోదండ‌రాం ఆరోపించారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక అప‌రిష్కృత స‌మ‌స్య‌లు పరిష్కరించుకోవాలే గానీ అప్ప‌టి ప‌రిస్థితులే ఎలా కొన‌సాగుతాయ‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. కార్పొరేట్ వ‌ర్గాలు ఎక్క‌డున్నా ఒక‌టే అని.. వారిని కూడా ప్రాంతాల ప్రతినిధులుగా చేసి విభజన తర్వాత కూడా పాత వాదనలే వినిపించ‌డ‌మెందుకుని అంటున్నారు. వాళ్ల‌కు కాంట్రాక్టులు ఇవ్వడం సరికాదంటే.. కేసీఆర్ ప్ర‌భుత్వంపైనే నేరుగా విమ‌ర్శ‌లు చేయాలి గానీ.. ప్రాంతాల ప్ర‌సక్తి ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు.