కోదండ‌రాం పార్టీతో టీఆర్ఎస్‌కు ఎఫెక్ట్ ఎంత‌

దేశంలో ఉద్య‌మాల మీద‌ ఉద్య‌మాలు చేసి ప‌ట్టుబ‌ట్టి రాష్ట్రం సాధించిన 29వ రాష్ట్రంగా తెలంగాణ చ‌రిత్ర సృష్టించింది. అయితే, ఇప్పుడు తాజాగా మ‌రో రికార్డు సృష్టించ‌నుంద‌నే టాక్ వినిపిస్తోంది! అదేంటంటే… పొలిటిక‌ల్‌గా తెలంగాణ మ‌రో యూ ట‌ర్న్ తీసుకుంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ముఖ్యంగా ఉద్య‌మ స‌మ‌యంలో అన్నీతానై మేధావులను క‌దిలించి నిత్యం ప‌త్రిక‌ల్లో ఏదో ఒక వ్యాసం లేదా ఆర్టిక‌ల్‌తో ఉద్య‌మాన్ని ఉధృతం చేసిన ఉస్మానియా ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఇప్పుడు స‌రికొత్త‌గా పార్టీకి శ్రీకారం చుడుతున్నార‌నే వార్తలు ఊపందుకున్నాయి. అయితే, ఇది ఢిల్లీ రాజ‌కీయాల‌ను ఓ మ‌లుపు తిప్పిన అర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరిగా ఉంటుందా? లేద సాధార‌ణ రాజ‌కీయాల మాదిరి ఉంటుందా? అనేది వేచి చూడాల్సిందే.

ప్ర‌త్యామ్నాయ‌ రాజకీయం అన్న అంశంపై తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన ప్రత్యేక సదస్సుకు హాజరైన సందర్భంగా ఆప్ మాజీ నేత ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ కొన్ని కీల‌క రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేశారు. సమీప భవిష్యత్తులో కోదండరాం రాజకీయ పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఆయ‌న వెల్ల‌డించారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలో రాజకీయ పార్టీ రావాలని, ఇది ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుందని తాము భావిస్తున్నామని యాద‌వ్‌ పేర్కొనడం గ‌మ‌నార్హం.

నిజానికి తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌తో భుజం భుజం రాసుకుని ప‌నిచేసిన కోదండ‌రాం.. ఆ త‌ర్వాత కేసీఆర్ పాల‌న‌లోని లోపాల‌ను ఎత్తి చేపుతున్నారు. ఒకానొక సంద‌ర్భంలో కేసీఆర్ పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌డ‌మే కాకుండా టీఆర్ ఎస్ బ‌ద్ధ శ‌త్రువు టీడీపీతో క‌లిసి.. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలో కోదండ‌రాం కొత్త పార్టీ పెడ‌తార‌ని అంద‌రూ భావించారు. ఇదే జ‌రిగితే.. నిజంగానే కేసీఆర్‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని మేధావులు భావిస్తున్నారు.

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాల‌న్ని కేసీఆర్ దెబ్బ‌కు పూర్తిగా బ‌ల‌హీన‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డ ఉన్న మేథావుల వ‌ర్గాన్ని, ఇత‌ర పార్టీల్లో బ‌లంగా వాయిస్ వినిపించే నేత‌ల‌తో పాటు అవినీతి మ‌ర‌క‌లేని వాళ్ల‌ను క‌లుపుకుని ఆయ‌న పార్టీ పెడితే అది టీఆర్ఎస్‌కు ధీటుగానే ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. నిజానికి తెలంగాణ‌లో కోదండ‌రాం పార్టీ పెడితే అది మ‌రో ఆప్ అవుతుంద‌ని కూడా ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి .