ఆంధ్రాలో నారాయ‌ణ‌మూర్తి సినిమాకు తొక్కేశారా..!

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. గ‌తేడాది కూడా నాలుగు సినిమాలు వ‌చ్చినా నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి. గ‌తేడాది నాన్న‌కు ప్రేమ‌తో – డిక్టేట‌ర్ – ఎక్స్‌ప్రెస్ రాజా – సోగ్గాడే చిన్ని నాయినా ఈ నాలుగు సినిమాలు వ‌చ్చి హిట్ కొట్టాయి. ఈ యేడాది కూడా సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. వీటిలో మెగాస్టార్ ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌కృష్ణ శాత‌క‌ర్ణి సినిమాల‌తో పాటు శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి కూడా రిలీజ్ అయ్యింది. ఈ మూడు సినిమాలు వ‌సూళ్ల ప‌రంగా దూసుకెళుతున్నాయి.

అంద‌రూ ఈ మూడు సినిమాల గురించే మాట్లాడుతున్నా వీటితో పాటే రిలీజ్ అయిన మ‌రో సినిమా గురించి ఎవ్వ‌రూ చ‌ర్చించుకోవ‌డం లేదు…అదే ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి హెడ్‌కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌. ఈ సినిమాకు థియేట‌ర్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జ‌రిగింది. ఈ విష‌యాన్నిఆర్‌.నారాయ‌ణ‌మూర్తే స్వ‌యంగా మీడియా ముందు చెప్పుకుని వాపోయారు.

సినిమాకు టాక్ బాగున్నా థియేటర్లు లేని కారణంగా ఎవరూ చూడలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. హెడ్‌కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌కు ఆంధ్రాలో తీవ్ర అన్యాయం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు నైజాంలో 23 థియేట‌ర్లు దొరికితే, ఆంధ్రాలో కేవ‌లం ఒక్క థియేట‌ర్ మాత్ర‌మే దొరికింది.

ఖైదీ-శాత‌క‌ర్ణి-శ‌త‌మానం భ‌వ‌తి కోసం ఆంధ్రాలో అన్ని థియేట‌ర్లు బుక్ చేసేయ‌డంతో ఇక్క‌డ ఆ మూడు సినిమాలు పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూట‌ర్ల దెబ్బ‌కు నారాయ‌ణ‌మూర్తి సినిమా బ‌లైపోయింది. దీనిపై నారాయ‌ణ‌మూర్తి స్పందిస్తూ థియేట‌ర్ల విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు జోక్యం చేసుకుని త‌మ సినిమాకు న్యాయం చేయాల‌ని కోరుతున్నారు. మ‌రి ఇద్ద‌రు చంద్రుళ్లు నారాయ‌ణ‌మూర్తి గోడును ప‌ట్టించుకుంటారా…?