శ‌శిక‌ళ‌కు ముందుంది ముస‌ళ్ల పండ‌గ

త‌మిళ‌నాట రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. పార్టీప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఇక రేపో మాపో సీఎం పీఠంపై కూర్చోవాల‌ని చూస్తున్న శ‌శిక‌ళ‌కు.. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీప దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ శత జయంతి ఉత్సవాల ఆరంభదినమైన ఈ నెల 17వ తేదీన తాను రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు దీప అధికారికంగా ప్రకటించారు. దీంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టిస్తే `అధికార పార్టీ అన్నాడీఎంకేకి ముందుంది ముస‌ళ్ల పండ‌గ` అన్న చందంగా ప‌రిస్థితి మారింది!!

అమ్మ జ‌య‌ల‌లిత‌ వార‌సురాలిగా రాజ‌కీయ అరంగేట్రం చేసేందుకు ఆమె మేన‌కోడ‌లు దీప రంగం సిద్ధం చేసుకున్నారు. జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ‌ సీఎం కావాల‌ని అన్నాడీఎంకే నేత‌లు ప‌లు సందర్భాల్లో త‌మ అభిప్రాయం వ్య‌క్త‌ప‌రిచారు. ఇందుకు అనుగుణంగా అన్ని వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో శ‌శిక‌ళ స‌ఫ‌ల‌మ‌య్యారు. కానీ ప్ర‌జ‌లు మాత్రం ఆమె అభ్య‌ర్థిత్వాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. అధికశాతం మంది అన్నాడీఎంకేపై అభిమానాన్ని చంపుకోలేక, అలాగని శశికళ నాయకత్వంలో ఇమడలేక నలిగిపోతున్నారు. అలాగే జ‌య మేన‌కోడ‌లు దీప రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఒత్తిడి కూడా అధిక‌మైంది. దీంతో ఆమె రాజ‌కీయ అరంగేట్రంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

కొందరు ఉత్సాహవంతులు సేలం జిల్లాలో దీప పేరవైని స్థాపించడమేగాక రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు సాగిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మరో అభిమాన వర్గం ‘జయలలిత, ఎంజీఆర్‌ అన్నాడీఎంకే’ అనే పార్టీ పెట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ‘అఖిల భారత అమ్మ ద్రవిడ మున్నేట్ర కళగం’ (ఏఐఏడీఎంకే) అనే పార్టీ ఇటీవల నామక్కల్‌లో నెలకొల్పడమేగాక పతాకాన్నికూడా ఆవిష్కరించారు.

జయలలిత రాజకీయ సలహాదారు దురై బెంజిమిన్‌ ‘అమ్మ మక్కల్‌ మున్రేట్ర సంఘం’ను సోమవారం స్థాపించి రిజిస్ట్రేషన్‌ కూడా చేయించారు.అయితే ఆమె పేరవైలో చేరుతారా, కొత్త పార్టీ పెడతారా, అలాగాక మరేదైనా ప్రముఖ పార్టీలో చేరుతారా అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆమె అన్నాడీఎంకేలో చేరే అవకాశం కూడా లేక‌పోవ‌డంతో దీప రాజకీయ నిర్ణయం ఎలా ఉండబోతోందోనని అన్ని పార్టీల్లోనూ ఆసక్తి నెలకొంది.