బ్రాహ్మ‌ణి సర్వే…జ‌గ‌న్ సీఎం ఖాయ‌మేనా…!

ఐదేళ్ల‌లో రెండున్న‌రేళ్లు గ‌డిచిపోయాయి! ఇక మిగిలింది స‌గం స‌మ‌య‌మే! 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం పార్టీలు అస్త్రశ‌స్త్రాలు సిద్ధం చేస్తున్నాయి! మ‌రి ఈ రెండున్న‌రేళ్ల‌లో ప్ర‌భుత్వం ఎలా ప‌నిచేసింది? హామీలు నెర‌వేర్చిందా? ప‌్ర‌తిప‌క్షం ఎంత‌వ‌ర‌కూ త‌మ పాత్రను నెర‌వేర్చింది? అనే అంశాల‌పై స‌ర్వేలు జోరందుకున్నాయి. ఈ మధ్య చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి ఒక థర్డ్ పార్టీతో చేయించిన‌ సర్వే ప్రకారం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలంటూ వస్తే టీడీపీ కేవలం 57 సీట్లకు పరిమితం అవుతుందని తేలిందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మ‌రో స‌ర్వేలోనూ ఇటువంటి ఫ‌లితాలే వ‌చ్చాయి. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు సీఎం పీఠం ద‌క్క‌డం ఖాయ‌మ‌ని తేలింది.

ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత విశ్వాసం ఉంది? ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్ష వైసీపీ ఎంత మేరకు క్యాష్ చేసుకుంటోంది? అనే అంశాల గురించి జరిపిన అధ్యయనంలో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. ఒక థర్డ్ పార్టీ జరిపిన ఈ సర్వేలో వైసీపీ హవా స్ప‌ష్టంగా కనిపిస్తోంది. దీని ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే 175 సీట్లకు గానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిష్టం గా 97 స్థానాల్లో జయకేతనం ఎగురవేసే అవకాశాలున్నాయని తేలింది. రెండున్నరేళ్ల పాలన అనంతరం.. చంద్రబాబు తీరుపై ఒక అంచనాకు వచ్చిన ప్రజానీకం ఇప్పుడు జ‌గ‌న్‌కు అవ‌కాశ‌మిచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌.

ఇక ప్రాంతాల‌వారీగా చూస్తే.. గత ఎన్నికల్లో టీడీపీకి కీలకంగా నిలిచిన ఉభ‌య‌ గోదావరి, అనంతపురం జిల్లాల్లో టీడీపీకి తీవ్రమైన ఎదురుగాలి వీస్తోందట‌. రుణమాఫీ హ‌మీని అమ‌లు చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లమైంద‌ని, ఈ విష‌యంలో రైతుల కుటుంబాలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాయ‌ట‌. అలాగే గోదావరి జిల్లాల్లో కాపులపై రిజర్వేషన్ల హామీ బలంగా పని చేసింద‌ట‌. విశాఖ వంటి ప్రాంతాల్లో మాత్రం తెలుగుదేశం పరిస్థితి కొద్దిగా బాగుంద‌ని స‌ర్వేలో తేలింది. తెలుగుదేశం – బీజేపీ – జనసేనలు కలిసి పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా.. వైకాపా 97 పై స్థాయి స్థానాల్లో విజయం సాధిస్తుంది ఆ కూటమి 70 స్థానాలకు పరిమితం అవుతుందని ఈ అధ్యయనం లో తేలింది. ఈ ఫ‌లితాలు వైసీపీ నేత‌ల‌కు నిజంగా ఆత్మ‌స్థైర్యాన్ని నింపేవ‌న‌డంలో సందేహం లేవు.