2019 వార్‌: టీడీపీ+బీజేపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌

ఏపీ రాజ‌కీయాల్లో నిన్న‌టి వ‌ర‌కు ఉన్న మబ్బులు వీడుతున్నాయి. మసకలు తొలగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని కొద్ది రోజులుగా చెపుతూ వ‌స్తోన్న ప‌వ‌న్ బుధ‌వారం అనంత‌పురం స‌భ‌తో మ‌రింత క్లారిటీ ఇచ్చాడు. తాను 2019 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని ఘంటాప‌థంగా చెప్పేశాడు. దీంతో 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో ముక్కోణ‌పు పోరుకు తెర‌లేచిన‌ట్ల‌య్యింది.

అనంత‌పురం స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌సంగం చూస్తే పొలిటిక‌ల్‌గా ప‌వ‌న్ స్టైల్ మారిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. గతంలో పంచెలూడదీసి కొడతాం అంటూ పరుషంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిట్టుకుంటేనే విమర్శలా? అంటూ ప్రశ్నించాడు. గత సభలతో పోలిస్తే అనంతపురంలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభ ఒకింత స్పష్టతతో సాగినట్లు కన్పిస్తోంది.

తాను చంద్ర‌బాబుతో అయినా, జ‌గ‌న్‌తో అయినా కేవ‌లం సిద్ధాంతాల ప‌రంగానే విబేధిస్తానే త‌ప్ప‌, వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ఎవ‌రి మీద ద్వేష‌భావం లేద‌ని చెప్పాడు. ఇక ప్ర‌త్యేక ప్యాకేజీతో పాటు చంద్ర‌బాబు/ టీడీపీ, మోడీ, వెంక‌య్య‌నాయుడ‌ల‌ను తాజా స‌భ‌లో చాలా స్ప‌ష్టంగా టార్గెట్ చేసి మాట్లాడాడు. ఏమీ లేని ప్ర‌త్యేక ప్యాకేజీని టీడీపీ ఎందుకు స్వాగ‌తించిందో చెప్పాల‌న్న ప‌వ‌న్ టీడీపీని ఇర‌కాటంలోకి నెట్టాడు.

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలపైనా పవన్ కళ్యాణ్ ఘాటుగానే స్పందించాడు. స‌న్మానాలు చేయించుకుంటున్నారంటూ వెంక‌య్య‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఏదేమైనా ప‌వ‌న్ అనంత‌పురం స‌భ త‌ర్వాత టీడీపీ – బీజేపీల‌పై తాను ఫైట్ విష‌యంలో ఎలాంటి రాజీప‌డ‌న‌న్న త‌న ఉద్దేశాన్ని చాటి చెప్పారు.

ఏపీలో పెరిగిన కుల రాజకీయాలు, అమరావతి, అవినీతి అన్ని అంశాలను పవన్ కళ్యాణ్ అనంతపురం సభలో ప్రస్తావించటం ద్వారా అటు బీజేపీ – టీడీపీతో తాను ఢీ అంటే ఢీ అనేలా వ్య‌వ‌హ‌రిస్తాన‌న్న సంకేతాలు బ‌లంగానే పంపారు. మరి ఇప్ప‌టి వ‌ర‌కు పవన్ విషయంలో సాఫ్ట్ గా ఉంటూ వచ్చిన టీడీపీ నేతలు ఇప్పుడు ప‌వ‌న్ విష‌యంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటారు ? జ‌న‌సేన వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య పొలిటిక‌ల్ ఫైట్ హీటెక్కుతుందా ? అన్న‌ది చూడాలి.

ఇక ఏపీలో వైకాపా రోజు రోజుకు బ‌ల‌హీన‌ప‌డుతుండ‌డంతో 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో పొలిటిక‌ల్ వార్ టీడీపీ+బీజేపీ వ‌ర్సెస్ జ‌న‌సేన మ‌ధ్యే ఉంటుంద‌న్న అంచ‌నాలు కూడా స్టార్ట్ అయ్యాయి.